మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ దక్కలేదు. మేజిక్ ఫిగల్ చేతికందలేదు. అధికార పీఠానికి ఇంకా 26 సీట్ల దూరంలోనే బీజేపీ పరుగు ఆగిపోయింది. అయినా.. ఇది మహా విజయమే. ప్రత్యర్థులను మట్టి కరిపించిన ఘన విజయమే. ఎందుకంటే.. అక్కడ జరిగింది సాధారణ ఎన్నికల సమరం కాదు. నాలుగు బలమైన రాజకీయ పక్షాల మధ్య జరిగిన సంకుల సమరం. అలాంటి చోట.. ఆ స్థాయి విజయం ఘన విజయమే.. శ్రేణులు సంబరపడే మహా విజయమే. దశాబ్దాల తరబడి కలసి పనిచేసిన శివసేనతో పొత్తులు విఫలమయ్యాయి. ఒంటరిపోరులోనూ బీజేపీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. మహారాష్ట్రలో పెరిగిన బలాన్ని సగర్వంగా ప్రదర్శించింది. ప్రజాతీర్పు సాక్షిగా రుజువు చేసుకుంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటముల్లో అత్యధికంగా నష్టపోయిన కాంగ్రెస్‌ వాటా సీట్లనే కాకుండా ఇతర చోట్ల కూడా భాజపా విజయబావుటాను ఎగరేసింది. మరి ఈ స్థాయి విజయం.. ఎలా సాధ్యమైంది. అందుకు దారి తీసిన పరిస్థితులేంటి..ఓసారి చూద్దాం.. మిత్రపక్షం శివసేనతో పొత్తు బెడిసికొట్టినప్పటి నుంచి బీజేపీ వ్యూహాత్మక వైఖరి అనుసరించింది. ఎన్నికలకు ముందు వంద సీట్లే ఇస్తామన్నశివసేనకు ఓట్ల సమరంతో సరైన సమాధానం చెప్పింది. చివరకు ప్రభుత్వ ఏర్పాటుకు శివసైనికులు తమతో కలసిరాక తప్పని పరిస్థితి కల్పించింది. మహారాష్ట్ర ఎన్నికల పోరు కొన్నాళ్ల వరకూ ద్విముఖంగానే సాగింది. బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్, ఎన్సీపీ కూటములే ప్రధాన పక్షాలుగా ఉండేవి. ఎవరికి వారే తమ పార్టీ నేత ముఖ్యమంత్రి కావాలన్న పంతం.. సొంత రాజకీయ అస్తిత్వంపై మక్కువతో మహారాష్ట్రలో చతుర్మఖ పోరుకు తెర తీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ-శివసేన కూటమి ఘన విజయం సాధించింది. దాదాపుగా క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 48 ఎంపీ స్థానాల్లో ఆరు తప్ప అన్నీ తన ఖాతాలోనే వేసుకుంది. సాధారణంగా ఈ పరిణామం ఆ రెండు పార్టీల మధ్య మిత్రత్వాన్ని మరికాస్త పెంచాలి. కానీ ఎవరికివారు తమ బలం వల్లే ఇంతటి ఘన విజయం సాధించిందని అంచనా వేసుకోవడం మిత్రబేధానికి దారి తీసింది. దేశాన్ని ఊపేసిన మోడీ మానియాను సొమ్ము చేసుకుంటే తనకు ఎదురులేదని భాజపా అభిప్రాయానికి వచ్చింది. మరోవైపు శివసేన కూడా అలాగే ఆలోచించింది. ఇంతటి సానుకూల వాతావరణం భవిష్యత్తులో వస్తుందని నమ్మకం లేనందువల్ల.. మరాఠా పీఠం దక్కించుకునేందుకు ఇంతకు మించిన సమయం ఉండదని అంచనా వేసింది. ఇందుకు సీట్ల సర్దుబాటు అంశాన్ని ఇరు పార్టీలు సాకుగా వాడుకున్నాయి. కూర్చుని పరిష్కరించుకుంటే సరిపోయే అంశాన్ని..ఇరు పార్టీలు కావాలని తెగదెంపుల దిశగా తీసుకెళ్లాయి. పాతికేళ్ల స్నేహానికి చరమగీతం పాడాయి. బీజేపీ-శివసేన సంగతి ఇలా ఉంటే.. విచిత్రంగా అటు అధికార కాంగ్రెస్‌, ఎన్సీపీ కూటమిలోనే అదే పరిస్థితి. బీజేపీ- శివసేన కూటమి విడిపోవడాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాల్సిన ఈ రెండు పక్షాలు.. ఆ పార్టీల బాటలోనే నడిచాయి. అనేక రకాల కుంభకోణాల్లో ఇరుక్కుపోయిన ఈ పార్టీలు.. ఒకరి బురద మరొకరికి అంటకూడదన్న ఆలోచనతో ఒంటరి పోరుకు సై అన్నాయి. వరుసగా మూడు పర్యాయాలు అధికారంలో ఉన్నందువల్ల ప్రభుత్వ వ్యతిరేకతను తప్పించుకునేందుకు రకరకాల ఎత్తులు వేశాయి. ఈ చతుర్ముఖ పోరు.. పార్టీలు, ఓటర్లనే కాదు.. ఎన్నికల విశ్లేషకులకూ తగినంత పని చెప్పింది. ఈ నాలుగు స్తంభాలాటలో గెలుపు ఎవరిపక్షం వహిస్తుందోనన్న సమీకరణాలు తేల్చడం వారికి తలకు మించిన పనే అయ్యింది. కాంగ్రెస్‌-ఎన్సీపీ కూటమి పరాజయంపై ఎవరికీ అనుమానాలు లేకపోయినా.. భాజపా, శివసేన, ఎంఎన్ఎస్ ల మధ్య ఓట్లు ఎలా చీలుతాయి.. అన్న అంశం మాత్రం ఉత్కంఠభరితంగా సాగింది. హిందుత్వ ఓట్లు ఎవరికి పడతాయి... సంప్రదాయ మరాఠావాదుల ఓట్లు ఎవరికి వస్తాయి. శివసేన, ఎంఎన్ఎస్ లలో వారు ఎవరిని ఎంచుకుంటారు. ఇలాంటి అంశాలు అందరిలో ఆసక్తి రేపాయి. మహారాష్ట్రలో ఎలాగైనా బలమైన శక్తిగా ఎదగాలని సంకల్పించుకున్న భాజపా అందుకు పటిష్ఠ వ్యూహాలు అమలుచేసింది. బాల్‌ థాకరే మృతి తర్వాత శివసేన బలహీనపడింది. దీనికి తోడు.. మోదీకున్న ఓబీసీ కార్డును ప్రయోగించింది. శివసేనకు దూరమైన ఉత్తరాది ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేసింది. 60 వరకు శాసనసభ స్థానాలు, 20శాతం గుజరాతీ ఓటర్లున్న ముంబయి-థానే ప్రాంతంలోనూ... మోదీ కార్డును ప్రయోగించిన కమలదళం... మహానగరంలో రెండు సేనల్ని నిలువరించే ప్రయత్నం చేసింది. 60స్థానాలున్న విదర్భ, 36 స్థానాలున్న ఉత్తర మహారాష్ట్రలో తిరుగులేని ఆధిక్యం కోసం పావులు కదిపింది. శివసేతో దోస్తీ తెగిపోయనా.. బీజేపీ చిన్నపార్టీలతో కలిసి ముందుకు నడిచింది. శివసేనపై ఎలాంటి విమర్శలు చేయకుండానే ఆ పార్టీని నిలువరించేందుకు బీజేపీ పటిష్ఠ ప్రణాళికతో ముందుకుసాగింది. ప్రభుత్వ వైఫల్యాలు, అధికారాన్ని అడ్డంపెట్టుకుని సాగించిన అవినీతిని ఎండగడుతూనే కాంగ్రెస్, ఎన్సీపీలను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పదునైన వ్యూహాలు అమలుచేసింది. ఆ రెండు పార్టీల తిరుబాటునేతలకు కాషాయ కండువాలు కప్పి.. వారిలో డజను మందికిపైగా టికెట్లు ఇచ్చింది. కొన్నిచోట్ల.. కాంగ్రెస్‌ నేతల బంధుగణాన్నే కమలం గుర్తుపై బరిలోకి దింపి... ప్రత్యర్థులకు సవాలు విసిరింది. కాంగ్రెస్‌, ఎన్సీపీలకు కంచుకోటలుగా పేరొందిన నియోజకవర్గాల్లోనే కమలాన్ని వికసింపచేయడంలో భాజపా సఫలమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: