సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఎంఎన్‌ఎస్‌ అధినేతకు మరాఠ ఓటర్లు కొర్రుకాల్చి వాతపెట్టారు. సీఎం పీఠం ఎక్కాలని కలలు కన్న రాజ్‌థాక్రేకు దిమ్మతిరిగేలా గుణపాఠం చెప్పారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఓటు బ్యాంకు కొల్లగొట్టేయాలనుకున్న థాక్రేకు కంగుతినే సమాధానమిచ్చారు. శివసేనపై తిరుగుబాటు చేసి ఎంఎన్‌ఎస్‌ పార్టీ స్థాపించిన రాజ్‌థాక్రే ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. ఒక్క క్షణంలో సెంటిమెంట్‌ పండిస్తారు. మరు క్షణంలో ఉగ్రరూపం దాలుస్తారు. ఇంకో క్షణంలో స్థానికులదే పైచేయి అంటూ ఊగిపోతారు. ఇలా ఏకకాలంలో రకరకాల పాత్రల్లోకి అవలీలగా పరకాయ ప్రవేశం చేసేస్తుంటారు. మహారాష్ట్ర ఎన్నికల్లో రాజ్‌థాక్రేకు మరాఠ ఓటర్లు గొయ్యి తీసి పాతిపెట్టినంత పనిచేశారు. కేవలం ఒక్కటంటే ఒక్కటే సీటు గెలిచి మిగతా స్థానాల్లో ఘోరంగా ఓడిపోయారు. మరాఠీ నినాదంతో సంచలనం రేపిన రాజ్‌థాక్రే ఈ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపలేక పోయారు. ఎన్నికల ప్రచారంలో రాజ్‌ థాక్రే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మరాఠీ యువతకు మాత్రమే ఉద్యోగం కల్పించాలని...ఇతర రాష్ట్రాల వారికి ఇవ్వొద్దని హోరెత్తించారు. ఇతరులకు ఎంట్రెన్స్‌లోనే నో ఎంట్రీ బోర్డ్ పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఆయన నోటి దురుసును గమనించిన ఈసీ నోటీసులు జారీ చేసి థాక్రేకు తలంటింది. అంతకుముందు మరో ప్రచారంలో ధనస్సు గుర్తుకైనా లేదా రైల్‌ ఇంజిన్‌ కైనా ఓటు వేయాలని చెప్పి అందిరినీ ఆశ్చర్యపరిచారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 13 సీట్లు కైవసం చేసుకున్న నవ నిర్మాణ్‌ సేన...ఈసారి కేవలం ఒక్క సీటే గెల్చుకోవడం పార్టీ గ్రాఫ్‌ ఏ స్థాయికి దిగజారిందో థాక్రేకు తెలిసొచ్చేలా చేసింది. కేవలం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినంత మాత్రాన ప్రజలు పట్టం కట్టరని సారువారికి బోధపడేలా చేశారు మరాఠ ఓటర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి: