కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ (తెలుగుదేశం) సింగ్‌పూర్‌లో ఉండగా సోమవారం నాడిక్కడ ఓ పరీక్షా కేంద్రంలో ఆయన స్థానంలో ఓ యువకుడు ఇంటర్ పరీక్ష రాస్తూ కెమెరాలకు చిక్కాడు. అయితే సోమవారం నాటి పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరయ్యారంటూ స్క్వాడ్ అధికారి షేక్ రషీద్ బుకాయిస్తున్నారు. గుట్టురట్టు కావటంతో ఆయన గైర్హాజరైనట్లు చూపుతున్నారని పలువురు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. వన్ సిట్టింగ్‌లో ఇంటర్ కోర్సు పూర్తిచేసేందుకు ప్రసాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ కోర్సుకు గంగూరులోని ఓ మహిళా కళాశాల ద్వారా ఇటీవల పరీక్ష ఫీజు చెల్లించారు. సెప్టెంబర్ 27న ప్రారంభమై నవంబర్ 10వ తేదీ వరకు జరిగే ఈ పరీక్షలకు పెనమలూరు మండలం పోరంకిలోని తాతినేని గోపయ్య అకాడమీకి చెందిన ఎస్‌కెవిఎస్ జూనియర్ కళాశాలను కేంద్రంగా నిర్ణయించారు. ఇప్పటికే మూడు పరీక్షలు జరగ్గా, ప్రసాద్ హాల్‌టిక్కెట్ నెంబర్ 1614301455తో రెండు పరీక్షలకు హాజరైనట్లు రికార్డుల ద్వారా తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఆయన సింగ్‌పూర్ వెళ్లారు. సోమవారం నాలుగో పరీక్షకు ఓ యువకుడు హాజరై ప్రసాద్ పేరిట ఆన్సర్ షీటుపై సంతకం కూడా చేసినట్లు కొందరు అభ్యర్థులు సెల్‌ఫోన్ ద్వారా తీసిన ఫొటో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ రహస్యం బైటకు పొక్కటంతో ఆ అపరిచిత యువకుడు అదృశ్యమయ్యాడు. దీనిపై కళాశాల నిర్వాహకులను ప్రశ్నించగా ఈరోజు పరీక్షకు ఎమ్మెల్యే ప్రసాద్ గైర్హాజరైనట్లు పరీక్ష ఆరంభమైన కొన్ని నిమిషాల్లోనే నమోదు చేశామని బదులిస్తున్నారు. సోమవారం పరీక్షకు 480 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 408 మంది హాజరయ్యారు. ప్రసాద్ రాయాల్సిన పరీక్షను ఆయన పేరుతో మరొకరు రాసిన సంఘటనపై విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: