‘శివసేన మద్దతు వద్దు, ఎన్సీపీ సహకారం వద్దు, సొంతంగా సర్కారు ఏర్పాటు చేయాలి’ ఇదీ బీజేపీ అసలు వ్యూహం. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేల మద్దతును బీజేపీ కూడగట్టగలిగింది. దీంతో మహారాష్ట్ర బీజేపీ ప్రస్తుత సంఖ్యా బలం 134కు చేరింది. 11 మంది ఎమ్యెల్యేల్లో ఇండిపెండెంట్లతో పాటు ఎంఎన్ఎస్ ఎమ్యెల్యే కూడా ఉన్నారు. దీంతో మరో 11 మంది ఎమ్యెల్యేల మద్దతు కూడగట్టగలిగితే బీజేపీ సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాగోలా ఆపరేషన్ ఆకర్ష్-తో మరికొంత మంది ఎంఎల్ఏల మద్దతు కూడగట్టాలన్న కసితో ఉన్న బీజేపీ శివసేనకు గట్టి షాక్ ఇచ్చే ప్రయత్నంలో ఉంది. మహారాష్ట్ర తదుపరి సీఎంపై మంగళవారం అధికార ప్రకటన వెలువడనుంది. కొత్త సీఎం దీపావళి రోజు ప్రమాణ స్వీకారం చేసేలా బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది.  మహారాష్ట్రలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎంఎల్ఏలంతా ముంబైలో భేటీ అయ్యారు. బీజేపీ శాసనసభా పక్షనేతను ఎంచుకునేందుకు వీరంతా భేటీ అయ్యారు. 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ సొంతంగా సర్కారు ఏర్పాటుచేసే స్థితిలో లేదు. శివసేన లేదా ఎన్సీపీ మద్దతుతో సర్కారు ఏర్పాటుచేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్న మహా బీజేపీలో కొత్త కూటమి కూడా ఆమోదయోగ్యుడైన సమర్థవంతుడైన సీఎం అభ్యర్థి కోసం కసరత్తు సాగుతోంది. పార్టీ పరిశీలకులుగా రాజ్-నాథ్-సింగ్, జేపీ నద్దాలు బీజేపీ ఎంఎల్ఏలతో భేటీ అయి తదుపరి సీఎంపై ఓ తుది నిర్ణయం తీసుకోనున్నారు. మహారాష్ట్రలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతోనే తాము బీజేపీకి మద్దతిస్తామని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంచేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రానందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్సీపీ ప్రకటించింది. అయితే ఎన్సీపీ మద్దతు తీసుకోవాలా లేదా, అనేది బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ఎన్సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు. తాము సర్కారులో భాగస్వామ్యం కాబోమని కేవలం బయటి నుంచే మద్దతిస్తామని ఎన్సీపీ పేర్కొంది. కానీ ప్రజల పక్షాన నిలిచి అయిదేళ్ల పాటు మరాఠీలకు సేవచేసేందుకే ఈ చొరవ తీసుకుంటున్నట్టు అజిత్ పవార్ వివరించారు. బీజేపీ విదర్భ అంశం లేవనెత్తినప్పుడు తమ స్పందనేమిటో ప్రకటిస్తామని ఎన్సీపీ అంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: