మావోయిస్టులకు గిరిజనులే కొండంత అండ. నమ్మితే ప్రాణమిచ్చే అమాయక గిరిజనుల చాలా ప్రాంతాల్లో నక్సలైట్లకు అండగా నిలుస్తారు. ఆపద సమయాల్లో ఆశ్రయమిచ్చి కాపాడతారు. అలాంటింది విశాఖ మన్యంలో అడవి బిడ్డలు తిరగబడ్డారు. మీ అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ ముగ్గురు మావోయిస్టులపై దాడికి దిగారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. మూడు గ్రామాల జనం ఒక్కటై.. ముగ్గురు మావోయిస్టులను చితకబాది చంపేశారు. మావోయిస్టులు తమ కంచుకోటగా భావించే విశాఖ జిల్లా చింతపల్లి మండలం కోరుకొండ అటవీప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీస్ ఇన్ ఫార్మర్ గా పనిచేస్తున్నాడన్న నెపంతో.. వీరవరం గ్రామానికి చెందిన సంజీవరావు అనే గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపడం ఈ వరుస సంచలనాలకు అసలు కారణం. సంతకు వెళ్లి వస్తున్న సంజీవరావును ఏకే 47తో కాల్చి.. అతని గురువు సింహాచలాన్ని కూడా చేతులు విరిచికట్టి తీసుకెళ్తుండగా సంతకు వచ్చిన గిరిజనులు ఎదురు తిరిగారు. వారి దగ్గరున్న ఏకే 47ను లాక్కుని..దాంతోనే ముగ్గురినీ చితకబాదారు. మూకుమ్మడిగా మూడు గ్రామాల జనం విచక్షణారహితంగా చేయిచేసుకోవడంతో ముగ్గురూ అక్కడికక్కడే చనిపోయారు. వారిలో ఒకరి డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. సంచలనం సృష్టించిన ఈ ఘటన తర్వాత.. కోరుకొండ బిక్కుబిక్కుమంటోంది. మావోయిస్టులు ప్రాబల్యప్రాంతంగా పేరున్న ఈ గిరిజన పల్లె.. ఇప్పుడు అన్నలు ఎక్కడ తమపై దాడి చేస్తారో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఈ ఘటన గురించి తెలియగానే పోలీసులు అక్కడికెళ్లారు. విశాఖ డీఐజీ ఆ ప్రాంతంలోనే మకాం వేశారు. ప్రజల రక్షణకు ఎలాంటి ఇబ్బందీలేదంటున్నారు. ఇన్ ఫార్మర్ల నెపంతో ఇప్పటివరకూ గిరిజనులు నలుగురిని చంపేశారు. ప్రతిసారీ వారికి గిరిజనుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: