దర్శకరత్న మరోసారి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేశారు. పేరు చెప్పకుండానే రాంచరణ్ అండ్ ఫ్యామిలీని కడిగిపారేశారు. సినీ పరిశ్రమలో గుండాయిజం నడుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తాన్నీ కబ్జా చేసి పారేశారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్మీరావే మాయింటికి సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సినీపరిశ్రమలోని తాజా వివాదాలపై కామెంట్లు చేశారు. లౌక్యం సినిమా బాగా ఆడుతున్నా.. ఓ పెద్ద హీరో సినిమా కోసం చాలాచోట్ల లౌక్యం సినిమాను తీసేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సినిమా మూడు రోజులు కూడా ఆడకపోయే సరికి దాన్ని తీసేసి మళ్లీ లౌక్యం సినిమానే ఆడిస్తున్నారని.. ఏంటీ దౌర్జన్యమని ప్రశ్నించారు. కొంత మంది పెద్దహీరోలు బంగారు చెంచాతో పుట్టారని.. వారిని జనం చూడకపోయినా.. వారి ముఖాలు చెక్కి చెక్కి మరీ బలవంతంగా జనంతో సినిమాలు చూపిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో సినీ పరిశ్రమపై అవగాహన ఉన్న చిన్నపిల్లాడైనా చెప్పేస్తారు. ఇటీవల విడుదలైన గోవిందుడు అందరివాడేలే.. సినిమా గురించే దాసరి ఈ కామెంట్స్ చేశారన్న విషయంపై ఎవరికీ అనుమానాలు లేవు. అంతేకాదు.. తమ కాలంలో ఇలా హీరోలను జనంపై రుద్దే పరిస్థితిలేదన్నారు దాసరి. అలా ఉంటే.. ఒక మోహన్ బాబు, మురళీ మోహన్, శ్రీహరి, నారాయణమూర్తి వంటి ఆర్టిస్టులను తాను తయారు చేసేవాడిని కాదన్న దాసరి కామెంట్లు ఆలోచింపచేశాయి. ప్రతిభ ఉన్నవాళ్లు పైకి వచ్చే పరిస్థితులు లేవన్న దాసరి.. రిలీజ్, ప్రమోషన్ వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని.. లక్ష్మీ రావే మా ఇంటికి..చిత్ర నిర్మాతలకు సలహా ఇచ్చారు. మరి దాసరి కామెంట్స్ పై మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: