రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ కరెంట్ చార్జీలు పెరగనున్నాయి. ఇప్పటికే సర్ చార్జ్ భారం మోస్తున్న జనం.. తాజాగా మరికొంత అదనపు భారం మోయక తప్పని పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనిపిస్తోంది. కేంద్రం సహజ వాయువు ధర ను పెంచడమే ఇందుకు కారణం.. గ్యాస్ ధర పెంచడంతో..గ్యాస్ ఆధారంగా కరెంట్ ఉత్పత్తి చేసే సంస్థలు కూడా ఆటోమేటిగ్గా ధరలు పెంచక తప్పదు.. ఈ పెంపును అటు కేసీఆర్ కానీ.. ఇటు చంద్రబాబుకానీ సొంతంగా భరించే పరిస్థితి లేదు. కాబట్టి ఈ భారం నేరుగా జనంపైనే పడనుంది. గ్యాస్ ధర పెంపు కారణంగా ప్రతివినియోగదారుడూ.. యూనిట్‌ ఒక్కింటికి 80 పైసల నుండి ఒక రూపాయల వరకూ అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ అదనపు భారాన్ని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల విని యోగదార్ల నుండి రాబట్టుకునేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించాయి. పెరిగిన భారాన్ని సర్ చార్జ్ రూపంలో వసూలు చేయాలని భావిస్తున్నారు. ఐతే ఈ చార్జీల మోతకు ఎలక్ట్రీసీటీ రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతించాల్సి ఉంది. ఆ లాంఛనం పూర్తికాగానే చార్జీల వాతకు రంగం సిద్ధమవుతుంది. వ్యవసాయ రంగంపై విద్యుత్‌ సర్‌ చార్జీల భారం మోపే అవకాశం లేకపోవడంతో ఆ భారం అంతా గృహ, పరిశ్రమల రంగాలపై పడనుంది. గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ప్రాజెక్టులు ఏపీ రాష్ట్రంలోనే ఉన్నా.. అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ రెండు రాష్ట్రాలు వాడుకుంటున్నందున చార్జీల భారం రెండు రాష్ట్రాల ప్రజలకూ తప్పనిసరి. మొత్తం మీద.. గ్యాస్ ధర పెంపు వల్ల.. ఏపీ, తెలంగాణ ప్రజలపై దాదాపు ఆరు వందల కోట్ల రూపాయలు భారం పడవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్యాస్ ధర మరీ తక్కువగా ఉందని.. పెంచకపోతే తాము ఉత్పత్తి చేయలేని పరిస్థితి ఉంటుందని కొన్ని నెలలుగా గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కేంద్రాన్ని కోరుతూ వస్తున్నాయి. కేంద్రం వారి మొర ఆలకించంతో.. ఇక ప్రజలకు త్వరలో ఛార్జీల షాక్ తప్పనిసరి కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: