మహారాష్ట్రలో ప్రజలు తాము ఇవ్వాల్సిన తీర్పును తాము ఇచ్చారు. తమ ఓటు ద్వారా అభిప్రాయాన్ని వినిపించారు. భారతీయ జనతా పార్టీని అతి పెద్ద పార్టీగా నిలిపారు. మొన్నటి వరకూ అధికారంలో ఉండిన కాంగ్రెస్, ఎన్సీపీలను చిన్న చిన్న పార్టీలుగా చేసి నిలబెట్టారు. శివసేనకు కొంచెం బెటర్ స్థానం ఇచ్చారు. మరి ఇటువంటి నేపథ్యంలో కూటమి రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరు ఎవరితో కలుస్తారు?! అనేది ఆసక్లికరంగా మారింది. మరి ఇప్పుడు సరికొత్త రాజకీయ పరిణామాలు ఆవిష్కారం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంచలన రీతి పరిణామాలు గనుక సంభవిస్తే మహారాష్ట్రలో తిరిగి కాంగ్రెస్ కూడా అధికార పక్షం కాగలదని అంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నంలో కూడా ఉందట! శివసేన, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే కాంగ్రెస్ పార్టీ వ్యూహం! ఎలాగూ శివసేన వాళ్లు ముఖ్యమంత్రి పీఠంపై దృష్టి సారించారు. ఏదేమైనా తను మహారాష్ట్రకు సీఎం కావాలని శివసేన అధినేత భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ బంపర్ ఆఫర్ ఇస్తోందని సమాచారం. శివసేన అధినేతకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసి, ఎన్సీపీని కలుపుకుపోయి... తమ బలంతో కూటమిని ఏర్పాటు చేసి అధికార పక్షంగా అవతరించాలనేది కాంగ్రెస్ పార్టీ వ్యూహమని తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ఈ ప్రతిపాదనను ఎన్సీపీ, శివసేనలకు పంపినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఎన్సీపీ దృష్టి అంతా బీజేపీ మీదే ఉంది. బీజేపీతో దోస్తీ కోసం ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అలాగే శివసేన కూడా అధికారాన్ని పంచుకొనే ప్రతిపాదనతో బీజేపీతో చేతులు కలిపే అంశం గురించి చర్చలు కొనసాగిస్తోంది. ఇటువంటి పరిణామాల మధ్య కాంగ్రెస్ ప్లాన్ వర్కవుట్ కావడం మాత్రమే కష్టమే..!

మరింత సమాచారం తెలుసుకోండి: