తెలంగాణా రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకున్న గులాబీ పార్టీ.. GHMCలో పాగా వేసేందుకు ప్రయత్నిస్తోంది. నిర్ణీత సమయానికి ఎన్నికలు జరిగితే.. ఆశించిన ఫలితాలు దక్కవనే అభిప్రాయంతో ఉంది.. దీనికి వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాకు ఆధార్‌ లింకు వంటి సాంకేతిక సాకులతో జాప్యం చేస్తోంది. తెలంగాణాలో టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు దక్కించుకున్న తర్వాత మొదటి సారి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండడంతో.. ఆ ఎన్నికల్లో విజయం కోసం పార్టీ అధినేత కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. ప్రభుత్వ తీరు చూస్తుంటే కొత్త పాలకవర్గం ఇప్పట్లో కొలువు దీరడం అనుమానమే? గ్రేటర్ హైదరాబాద్ లో బలహీనంగా ఉన్న పార్టీ బలోపేతమయ్యేందుకు ఇతర పార్టీల నుంచి వలసలను ప్రోత్సహిస్తోంది. మరో వైపు హైదరాబాద్ లో బలంగా ఉన్న MIMతో కలిసి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలోని పలువురు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు గులాబి గూటికి చేరిపోగా.. మరి కొంత మంది క్యూ కడుతున్నారు. క్షేత్ర స్థాయిలో కూడా నేతలను ఆకర్శించి ఆ తర్వాతే GHMC ఎన్నికలకు వెళ్లి అక్కడ గులాబి జెండా ఎగురేయాలన్నది కేసీఆర్‌ వ్యూహం. ఓ వైపు ఓటర్ల జాబితాను ఆధార్ తో అనుసంధానం.. మరో వైపు డివిజన్ల పునర్విభజన అంటూ సాంకేతిక కారణాలు సాకుగా వాయిదా వేస్తున్నారు. వార్డుల పునర్విభజన కూడా తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు పగ్గాలు వేసేలా ఉండాలన్నది ఆయన ఆలోచన. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు గ్రేటర్ లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదు. బడ్జెట్ సమావేశాల అనంతరం 10వేల కోట్లతో పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇలా కేసీఆర్‌ ఆలోచనలో ఉన్న రకరకాల ఈక్వేషన్స్‌ అమలు చేసేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని పార్టీ వర్గాలంటున్నాయి. రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్ తమ కంట్రోల్ లోకి వచ్చిందని భావిస్తేనే ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించాలనుకుంటున్నారు. ఇక్కడ ఓటమి పాలైతే పార్టీపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదే సమయంలో దేశ వ్యాప్తంగా ప్రతిష్ట దెబ్బతింటుందన్న భయం కేసీఆర్‌కు ఉందట.

మరింత సమాచారం తెలుసుకోండి: