మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం కోసం బిజెపిలో గ్రూపు తగాదాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి పదవిలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీని కూర్చోబెట్టక పోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఓ ఎమ్మెల్యే బెదిరింపులకు సైతం దిగాడు. బిజెపి మహారాష్ట్ర అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్‌ను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేయనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో, నితిన్‌ గడ్కరీ మద్దతుదారులు దీనికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇదే గనుక నిజమైతే తూర్పు నాగపూర్‌ అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తానని క్రిష్ణా ఖోపడే ప్రకటించాడు. నాగపూర్‌ నగర శాఖా అధ్యక్షుడిగా కూడా క్రిష్ణా ఖోపడే పనిచేస్తున్నారు. నిన్నటి ఎన్ని కల్లో తూర్పు నాగపూర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ అభ్యర్థి అభిజీత్‌ వంజారాను 40 వేల ఓట్ల తేడాతో ఓడించారు. మంగళవారం రోజు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తన మద్దతుదారులైన 40 మంది ఎమ్మెల్యేలతో నాగపూర్‌లో సమావేశమై, భవిష్యత్‌ రాజకీ యాలపై చర్చించారు. ఫడ్నవీస్‌ను ముఖ్య మంత్రి పదవికి ఎంపిక చేయనున్నారన్న వార్తలు బుధవారం నుండి ఊపందుకున్న నేపథ్యంలో గడ్కరీ సమావేశాలు అనేక అను మానాలకు తావిస్తోంది. అయితే నితిన్‌ వ్యవహారాన్ని బిజెపి అధినాయకులు అంత సీరియస్‌గా తీసుకున్నట్టుగా కనిపించటం లేదు. మరోవైపు నితిన్‌ గడ్గరీ కూడా ముఖ్యమంత్రి పీఠంపై తనకు ఎలాంటి ఆకాంక్ష లేదని అధికారికంగా ప్రకటించారు. అయితే ఎమ్మెల్యేలతో సమావే శమవటం ద్వారా బిజెపి అధినాయకత్వానికి ఏవో సూచనలు, సందేశాలు పంపాలని ఆయన భావిస్తున్నట్టు విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ''ముఖ్యమంత్రి పదవి గురించి ఇంతకుముందే వివరణ ఇచ్చాను. రాష్ట్ర రాజకీయాల్లోకి ప్రస్తుతం ప్రవేశించే ఉద్దేశం లేదు. కేంద్ర నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది. ఎలాంటి బాధ్యతలు ఇచ్చినా నిర్వహించడానికి సిద్ధమే''నని నితిన్‌ గడ్గరీ తాజా వ్యాఖ్యలు చేశారు. ఫడ్నవీస్‌, నితిన్‌ గడ్కరీ ఇద్దరూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు నుంచే వచ్చారు.  ఇరువురిపైనా ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీర్వాదాలు వున్నాయి. ఏక్‌నాథ్‌ ఖాడ్సే, వినోద్‌ తావ్డే వంటి సీనియర్‌ సభ్యుల కన్నా సిఎం రేసులో ఫడ్నవీస్‌ ముందున్నారు. ఫడ్నవీస్‌ పేరు ఇలా ప్రముఖంగా పరిశీలనలోకి రావడాన్ని నితిన్‌ గడ్గరీ మద్దతుదారులు ఏమాత్రమూ ఇష్టపడటం లేదు. బహిరంగంగానే నితిన్‌ గడ్గరీకి మద్దతు తెలిపేందుకు బిజెపి ఎమ్మేల్యేలు వెనుకాడటం లేదు. ''నితిన్‌ గడ్గరీ తిరిగి రాష్ట్ర రాజకీయాల్లోకి రావాలని బిజెపి నాయకులంతా కోరుకుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఆయన్ని చూడటానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. ఆయనకి పరిపాలనా అనుభవం ఎంతగానో వుంది. ముఖ్యమంత్రి అర్హులు జాబితాలో ఆయన ముందుంటారు''అని బిజెపి నాయకుడు సుధీర్‌ ముంగాతీవార్‌ మంగళవారంనాడు వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: