కాంగ్రెస్ అధికారంలో ఉంటే... ఆంధ్రా పాలకులు అంటూ తెలంగాణ టీడీపీ వాళ్లు కూడా ఇష్టాను సారం మాట్లాడేవాళ్లు. కిరణ్ వంటి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం వాళ్లు వీర తెలంగాణ వాదుల్లాగా మాట్లాడే వాళ్లు. అప్పటి సంగతి అలా ఉంటే... ఇప్పుడు మాత్రం తెలంగాణ టీడీపీది అడకత్తెరలో పోకచెక్క పరిస్థితే అవుతోంది. సీమాంధ్ర సహింత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటంతో వీళ్లు ఆంధ్ర పాలకులు.. అంటూ గట్టిగా ధ్వజమెత్తే పరిస్థితి లేదిప్పుడు. ఇదే తరుణంలో టీఆర్ఎస్ వాళ్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కత్తులు దూస్తున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తెలంగాణ టీడీపీ ఇబ్బందుల్లో పడుతోంది. ఇప్పుడు టీ.టీడీపీకి అలాంటి సంకటం ఒకటి వచ్చింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలపమంటారా? కొనసాగించమంటారా? అనేది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు తెలంగాణ ప్రాంత టీడీపీ నేతలను అడుగుతున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు టీ.టీడీపీ సమాధానం చెప్పలేకపోతోంది. విడమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్టుగా ఉంది తెలంగాణ టీడీపీ నేతల పరిస్థితి. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఇక చాలు... అనేది చంద్రబాబు వాదన. మరి ఆయన అభిప్రాయాన్ని తెలంగాణ టీడీపీ నేతలు తప్పుపట్టలేరు. మరి విద్యుత్ ఉత్పత్తి చాలు అని కూడా అనలేరు. అలాంటే తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఏమీ మాట్లాడలేని స్థితిలో ఉన్నారు తెలంగాణ టీడీపీ నేతలు.

మరింత సమాచారం తెలుసుకోండి: