విడిపోతే కలదు సుఖం.. అంటూ ఉద్యమం నిర్వహించి.. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణ ఆశలు నిజమవుతున్నాయట. ఏపీతో కలసి ఉన్నప్పటి కంటే.. విడిపోయిన తర్వాత.. ఈ ప్రాంత ఆదాయం గణనీయంగా పెరిగిందట. ఈ విషయాన్ని సర్కారు లెక్కలే ధ్రువీకరిస్తున్నాయి. కాస్తా కూస్తోకాదు.. మొత్తం మీద ఏకంగా.. 42 శాతం ఆదాయం పెరిగిందట. పెట్రోల్, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థలు, వ్యాపార సంస్థల నుంచి ఆదాయం... ఇలా అన్ని విషయాల్లోనూ గతంలో కంటే.. ఆదాయం భారీగా పెరిగింది. జనాభా నిష్పత్తి లో ఈ లెక్కలు తయారు చేశారు. విభజన సమయంలో తెలంగాణ జనాభాను 42 శాతంగా, ఆంధ్రప్రదేశ్ జనాభాను 58 శాతంగా లెక్కగట్టి ఆదాయం పంపిణీ చేశారు. గతేడాది ఇదే సమయానికి మొత్తం అమ్మకం పన్నులో తెలంగాణ నిష్పత్తి రూ. 1636కోట్లు ఉంది. ఈ ఏడాది అది రూ. 2325 కోట్లకు పెరిగింది. ఒక్క సెప్టెంబర్ నెలలోనే పెట్రోల్‌పై రూ.514 కోట్లు, మద్యంపై రూ.1168 కోట్ల ఆదాయం వచ్చింది. మద్యం విషయానికి వస్తే తెలంగాణలో బీర్లు, ఆంధ్రప్రదేశ్‌లో ఐఎంఎల్ లిక్కర్‌పై ఆదాయం పెరిగింది. పెట్రోల్‌పై 19 శాతం, మద్యంపై 28 శాతం, పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థలపై 81 శాతం, డివిజన్‌లలోని వ్యాపార సంస్థల నుంచి 68 శాతం ఆదాయం పెరిగింది. సిగరెట్ల పై మాత్రం 4శాతం వరకూ ఆదాయం తగ్గిందట. చాలాకాలంగా అయిల్ కంపెనీలతో టర్న్ ఓవర్ ట్యాక్స్ పై కొనసాగుతున్న వివాదంలో సికింద్రాబాద్ వాణిజ్యపన్నుల శాఖ అధికారులు ఎట్టకేలకు విజయం సాధించటంతో ఆమేరకు ఆదాయం పెరిగింది. ఇది భవిష్యత్తులోనూ పెరగనుంది. ఈ కేసులో గెలుపుతో బడా కంపెనీలు 500 కోట్ల రూపాయల సొమ్ము జరిమానాల రూపంలో రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: