ఇప్పటికే శ్రీశైలం జలవిద్యుత్ విషయంలో ఏపీతో పేచిపెట్టుకుంటున్న తెలంగాణ నాగార్జునసాగర్ విషయంలోనూ అదే పని చేసింది. ఏపీ అధికారులు వద్దు మొర్రో అంటున్నా విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. నాగార్జున సాగర్ జలాశయం ప్రధాన విద్యుత్ కేంద్రంలో ఆరు టర్బైన్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. శ్రీశైలం జలాశయంపై విద్యుత్ ఉత్పాదనపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల మధ్య వివాదం నెలకొనడంతో టీ ప్రభుత్వం శ్రీశైలంలో ఉత్పత్తి తగ్గించింది. సాయంత్రం ఒక్కసారిగా విద్యుత్ వినియోగ డిమాండ్ పెరగడంతో తెలంగాణ ఎస్ఎల్డీసీ ఆదేశాల మేరకు నాగార్జున సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రంలో ఆరు టర్బైన్ల ద్వారా ఆరు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. నీరు కిందకు వదిలితే ముంపు సమస్య వస్తుందంటున్నా... మాకు విద్యుత్ అత్యవసరం కాబట్టి ఉత్పత్తి చేసుకుని తీరతామని తెలంగాణ అధకారులు కుండబద్దలు కొడుతున్నారు. దాదాపు గంటన్నరపాటు విద్యుత్ ఉత్పాదన చేసి 25 వేల క్యూసెక్కుల వరకు నీటిని సాగర్ దిగువకు విడుదల చేశారు. నాగార్జున సాగర్ నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తే నిల్వచేసుకోలేని పరిస్థితి ఉందని వారం రోజుల క్రితం పులిచింతల సూపరింటెండెంట్ ఇంజనీర్ నాగార్జున సాగర్ ఎస్.ఈ. కి ఉత్తరం రాశారు. ప్రస్తుతం పులిచింతలలో 10 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ నిల్వ మరో 8 టీఎంసీలకు పెరిగితే... చాలా గ్రామాలు మునిగిపోతాయని... పులిచింతల నీటిపారుదల అధికారులు మొత్తుకుంటున్నారు. ఇప్పటికే పలు పులిచింతల పరిధిలోని గ్రామాలు ముంపు ముంగిట్లో ఉన్నాయి. వాస్తవానికి పులిచింతల ప్రాజెక్టులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉంచాలని ఏపీ సర్కారు ప్లాన్ చేసింది. అప్పుడే... డెల్టాకు సాగు నీరు అందించగలమని అంచనా వేసింది. రిజర్వాయర్‌లోకి నీటి నిల్వ పెరిగే కొద్ది ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. కేవలం పది టీఎంసీలీ నీరు నిల్వ ఉంచితేనే...చాలా గ్రామాల్లో పంటపొలాలు, రహదారులు నీట మునిగాయి. బెల్లంకొండ మండలంలోని గోపాలపురం, కామేపల్లి గ్రామాల భూములను వరద తాకింది. కోళ్లూరు, గొల్లపేట గ్రామాలను చుట్టుముట్టింది. చిట్యాల, చిట్యాలతండా, కేతవరం, శౌరినాయక్‌ తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: