ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉప ఎన్నికల్లో విజయం సాధించి నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగిడి అరుదైన రికార్డు సృష్టించారు. వారి విజయానికి కారణమైంది కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ. ఫ్యాక్షన్ కుటుంబానికి చెందిన భూమా నాగిరెడ్డి, ఆయన సతీమణి దివంగత భూమా శోభానాగిరెడ్డి, వీరి కూతురు భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి ప్రాతినిధ్యం వహించి రికార్డు సృష్టించారు. ఆళ్లగడ్డ శాసనసభ నియోజకవర్గం నుంచి 1989లో గెలుపొందిన భూమా శేఖర్‌రెడ్డి 1992లో అనారోగ్యంతో మరణించారు. ఆయన స్థానంలో సోదరుడు నాగిరెడ్డి 1992 ఉప ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసి సమీప ప్రత్యర్థి గంగుల ప్రభాకర్‌రెడ్డిపై విజయం సాధించారు. 1997లో భూమా నాగిరెడ్డి నంద్యాల లోక్‌సభ స్థానానికి ఎన్నిక కావడంతో ఆళ్లగడ్డ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఆ ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి సతీమణి భూమా శోభానాగిరెడ్డి మొదటిసారి పోటీచేసి ప్రత్యర్థి ఇరిగెల రాంపుల్లారెడ్డిపై గెలుపొందారు. గత మేలో జరిగిన సాధారణ ఎన్నికలకు ముందు రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించడంతో ఆళ్లగడ్డలో మరోమారు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ తొలిసారి పోటీచేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబానికి చెందిన తల్లి, తండ్రి, కుమార్తె ముగ్గురూ రాజకీయ ఆరంగేట్రానికి ఉప ఎన్నికలు వేదిక కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: