తిండి,బట్ట తర్వాత మానవుడి కనీస అవసరం.. గూడు. అత్యంత ప్రాధమిక అవసరమే అయినా.. ఇప్పటికీ వందల కోట్ల కుటుంబాలకు సొంత గూడు అన్నది లేకుండా పోయింది. స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రభుత్వాలు.. ఎన్నో పథకాలు అమలు చేసినా.. సొంతిల్లు లేని వారి సంఖ్య ఇప్పటికీ వందల కోట్లలోనే ఉంది. ఇప్పుడు మోడీ సర్కారు.. ఆ సామాన్యుడి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దాదాపు 50 లక్షల కోట్ల నిధులతో భారీ గృహయజ్ఞానికి శ్రీకారం చుడుతోంది. 2022 నాటికి పట్టణాలు, నగరాల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మించే దిశగా మోడీ సర్కారు కొత్త గృహ విధానం రూపొందిస్తోంది. ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్ పటేల్‌ హౌసింగ్ మిషన్‌ పేరుతో ఇప్పటి వరకు అమలవుతున్న అన్ని గృహ నిర్మాణ పథకాలను ఒకే గొడుగు కిందకు తెస్తారు. స్మార్ట్‌ సిటీల నిర్మాణంతో సహా, పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ది, పారిశుద్య్ధం వంటివి ఇందులో ప్రధానంగా ఉన్నాయి. ఈ రంగానికి ఊతం ఇచ్చేలా ఆదాయపు పన్ను వెసులు బాట్లే కాకుండా... దేశీయ, విదేశీ మౌలిక సదుపాయాల సంస్థలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాం ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదించింది. మోడీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ జనాభాలో మూడోవంతు మంది నగరాలు, పట్టణాలు, శివారు ప్రాంతాల్లోనే నివశిస్తున్నారు. దేశ జనాభాలో ఐదింట రెండు వంతుల మంది మురికి వాడల్లోనే సర్దుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చడమే లక్ష్యంగా కేంద్రం కార్యచరణ ప్రారంభించింది. కేవలం ఇళ్లే కాకుండా.. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు, రాత్రి వేళల్లో తలదాచుకునేందుకు తాత్కాలిక కేంద్రాలు వంటి వాటినీ ఈ కార్యక్రమం కింద నిర్మిస్తారు. ఈ ప్రతిష్టాత్మక పథకం రూపకల్పనలో ఉపగ్రహ సమాచారాన్ని కూడా వినియోగించుకుంటారట.

మరింత సమాచారం తెలుసుకోండి: