ఒక డిమాండ్ కోసం రకరకాల పద్దతుల్లో ఆందోళన చేయడం చూశాం. మనదేశం విషయానికి వస్తే గాంధీ పుణ్యమా అని.. సత్యాగ్రహాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.. మన ఆందోళనల్లో ఓ భాగమైపోయాయి. అది రాజకీయ సమస్య అయినా.. సామాజిక సమస్య అయినా.. నిరసన తెలపాలంటే.. ఏదో ఒక దీక్ష చేయాల్సిందే. అలాగే దక్షిణ సూడాన్ దేశంలోనూ మహిళలు తమ అభిప్రాయం బలంగా చెప్పేందుకు.. దేశంలో శాంతి నెలకొల్పేందుకు ఓ వెరైటీ సమ్మె చేయబోతున్నారు. మగవాళ్లందర్నీ శృంగారానికి దూరంగా ఉంచి.. నిరసన తెలిపేందుకు వ్యూహం రచిస్తున్నారు. దక్షిణ సూడాన్ కొంతకాలంగా అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా దేశంలో శాంతి నెలకొనే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ అంశంపై సీరియస్ గా మీటింగ్ పెట్టుకున్న మహిళా ఎంపీలు, సంఘసేవికలు.. దేశంలో శాంతి నెలకొనే వరకు మహిళలందరూ శృంగార సమ్మె చేస్తే ఎలా ఉంటుందా అని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. దేశంలో పరిస్థితులు అదుపులోకి వచ్చేవరకు... ప్రతి మహిళ తన భర్తను శృంగారానికి దూరంగా ఉంచాలని పిలుపునిచ్చారు. మరి మొగుళ్లను పడక పస్తులుంచితే సమస్య పరిష్కారమవుతుందా... ఇదే సందేహం చాలా మంది వెలిబుచ్చారు. అందుకు వారు చరిత్రనే సమాధానంగా చెబుతున్నారు. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే తరహా శృంగార సమ్మెతో లైబీరియాలో మహిళలు విజయం సాధించారట. దేశంలో దశాబ్దంన్నర నుంచి నలుగుతున్న అంతర్యుద్ధానికి తెర దించారట. అంతే కాదు.. ఆనాటి శృంగార సమ్మెకు నేతృత్వం వహించిన లేమా గోవీ అదే ఏడాది నోబెల్ శాంతి బహుమతి అందుకున్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. మరి దక్షిణ సూడాన్ మహిళల శృంగార సమ్మె ఎంతవరకూ ఫలితాలనిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: