మనిషి ఎంతగా అభివృద్ధి చెందినా... ప్రకృతి ముందు మాత్రం ఇంకా చిన్నవాడే.. ప్రకృతి పగబట్టి కన్నెర్ర చేస్తే ఎంతటి గొప్పదేశమైనా.. అతలాకుతలం కావలసిందే. ప్రపంచ చరిత్రలో నమోదైన ఎన్నో విపత్తులు ఈ విషయాన్ని రుజువు చేశాయి. మనిషి ప్రకృతిని శాశించలేకపోయినా.. అది కలిగించే విపత్తుల ద్వారా కలిగించే నష్టాలను మాత్రం పరిమితం చేయొచ్చు. తాను సముపార్జించిన సాంకేతిక పరిజ్ఞానాన్నిఅందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ విషయాన్ని హుద్ హుద్ సమయంలో.. భారత్ రుజువు చేసింది. అష్టకష్టాలుపడి ఓ సదుపాయాన్ని సమకూర్చుకుంటే.. దాని ఫలితం మనల్ని అవసరంలో ఆదుకుంటుందని మనదేశం నిరూపించింది. గతేడాది జూలైలో ఫ్రెంచ్‌గయానా నుంచి మనదేశం ప్రయోగించిన ఇన్‌శాట్‌ -3డీ ఉపగ్రహం హుద్ హుద్ విషయంలో అత్యంత కచ్చితమైన సమాచారాన్ని అందించింది. ఈ ఉపగ్రహం.. ఈ జనవరి నుంచి పూర్తిస్థాయిలో వాతావరణ సంబంధమైన సమాచారం అందజేస్తోంది. అక్టోబర్‌ 12న విశాఖలో తీరందాటిన హుద్‌హుద్‌ తుపాను ప్రారంభం నుంచి తీరం దాటే... వరకూ... ఇన్‌శాట్‌-3డీ పంపిన ఛాయాచిత్రాలు దేశాన్ని అద్భుతంగా ఉపయోగపడ్డాయి. తుపాను సమాచారాన్ని ప్రతి గంటకు అందించింది. అంతే కాదు.. విశాఖలో అక్టోబర్ 12న తుపాను తీరం దాటుతుందని దాదాపు 2 రోజుల ముందే చెప్పగలిగింది. దీనివల్ల ముందస్తు చర్యలు తీసుకోవడానికి అవకాశం కలిగింది. పెద్ద ఎత్తున తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను తరలించేశారు. ప్రాణనష్టం కలగకుండా కాపాడగలిగాం.

మరింత సమాచారం తెలుసుకోండి: