ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీకే చెందిన సీనియర్ నేత వడ్డే శోభనాద్రీశ్వర్రావు ఏకిపారేశారు. నయా రాయ్-పూర్, గాంధీనగర్-లను ఉదాహరణగా చూపిన ఆయన, ఏపీ రాజధానికి వేలాది ఎకరాలు ఎందుకని సీఎం చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. స్వపక్షంలో విపక్ష మాదిరిగా ఆయన చంద్రబాబు నాయుడిపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజధానిపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు క్లారిటీ ఇవ్వడం లేదంటూ మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. అసలు రాజధాని నిర్మాణానికి లక్షల ఎకరాలు ఎందుకో బాబు చెప్పాలన్నారు. రకరకాల కమిటీలతో కాలయాపన చేస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారన్నారు. రాజధాని నిర్మాణం రోజు రోజుకూ ఆలస్యమవుతుండటంతో బాబు సర్కారుపై సర్వత్రా విమర్శల వర్షం కురుస్తోంది. రాజధాని నిర్మాణానికి లక్ష ఎకరాల భూమి ఎందుకో చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. లక్ష ఎకరాల్లో ప్రపంచ స్థాయి నగరమంటూ చెబుతోన్న ముఖ్యమంత్రి అసలు లక్ష ఎకరాలు సేకరించాలంటే ఊళ్లకు ఊళ్లనే ఖాళీ చేయించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పడి నెలలు గడుస్తున్నా రాజధాని విషయంలో ఎందుకు స్పష్టతనివ్వడం లేదని వడ్డే సూటిగా ప్రశ్నించారు. రాజధాని కోసం యనమలతో ఓ కమిటీ, నారాయణతో ఓ కమిటీ నిధుల కోసం సుజనా చౌదరితో మరో కమిటీని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు జనాన్ని గందరగోళానికి గురిచేస్తున్నారని శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. చండీగఢ్, భువనేశ్వర్, నయా రాయ్-పూర్-లను ఉదహరించే ముఖ్యమంత్రి నయారాయ్-పూర్-కు కేంద్రం 200 కోట్లు కూడా ఇవ్వలేదని గుర్తించాలన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్, గవర్నర్ బంగ్లా, హైకోర్టు, మంత్రులు, అధికారుల నివాస సముదాయాలు అన్నింటిని కలిపి 700 హెక్టార్లలోనే ఏర్పాటు చేశారన్నారు. గాంధీనగర్-లో రాజధాని కేవలం 190 ఎకరాల్లోనే ఉందని గుర్తుచేశారు. మలేషియాలో పుత్రజయ 12 వేల ఎకరాల్లో ఉందన్న ఆయన మలేషియా జిడిపి 330 బిలియన్ డాలర్లైతే మన జిడిపి 30 ట్రిలియన్ డాలర్లు కూడా లేదన్నారు. హైదరాబాద్-లో ఔటర్ రింగ్ రోడ్డు 158 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటే విజయవాడలో మాత్రం 180 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎందుకని వడ్డే ప్రశ్నించారు. కృష్ణానదిపై ఓ వంతెన నిర్మించాలంటే నాలుగేళ్ల క్రితం లెక్కల్లో 360 కోట్ల ఖర్చైతే ఇప్పుడు నాలుగైదు రెట్లు అంచనా పెరిగిందన్నారు. సీఎం మాటలు గాల్లో మేడలు కట్టడంలా ఉందన్న వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆయన చెబుతున్న మాటలు చూస్తుంటే తన మనుమలు కూడా కొత్త రాజధానిని చూడలేరని ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: