మహారాష్ట్రలో శివసేనతో పొత్తు లేకుండా సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ చూస్తోంది! బీజేపీకి తాము బయటి నుంచి బేషరతు మద్దతు ఇస్తామని ఎన్సీపీ ప్రకటించిన నేపథ్యంలో... దాని సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పర్చే పరిస్థితి కనిపిస్తోంది. శివసేన లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ అవకాశాలున్నాయని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రేతో సహా పలువురు నేతలు ఎన్నికల ప్రచారంలో మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో... బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు క్షేత్రస్థాయిలో కార్యకర్తలు కూడా శివసేనతో కలిసి పని చేయడానికి వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. శనివారం ఒక ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ముంబై వచ్చిన మోదీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఫడ్నవీస్‌, అసెంబ్లీలో పార్టీ నేత వినోద్‌ తౌడే... ఎయిర్‌పోర్టులో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించారు. వీరి చర్చల సారాంశం తెలియకపోయినా... పార్టీ నేతల్లో శివసేనపై ఉన్న వ్యతిరేకతను వారు తెలియచేసినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర నాయకత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పార్టీ సీనియర్‌ నేతలు అంటున్నారు. మరోవైపు, బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ శనివారం ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ను కలిశారు. నాగ్‌పూర్‌లోని సంస్థ కేంద్ర కార్యాలయానికి ద్విచక్ర వాహనంపై వెళ్లిన ఆయన.. దీపావళి సందర్భంగా ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సారి కూడా భగవత్‌ను కలిసినట్లు ఆ తర్వాత మీడియాతో చెప్పారు.  పలు ‘ముఖ్య’ విషయాలపై చర్చించుకున్నా, మహారాష్ట్ర రాజకీయాలపై మాత్రం మాట్లాడుకోలేదన్నారు. ఇక కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సమక్షంలో పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం సమావేశమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుపై శివసేనతో తెరవెనుక చర్చలు సాగుతున్నాయనీ పార్టీవర్గాలు తెలిపాయి. ఏదేమైనా ఈ నెల 29 లేదా 30న కొత్త ప్రభుత్వం కొలువుదీరే అవకాశముందని బీజేపీ వర్గాలు చెప్పాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: