రాజధాని కళ సంతరించుకుంటోన్న బెజవాడ వైపు.. ఐటీ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. విశాఖను వదిలి విజయవాడలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయాలని పారిశ్రామికవేత్తలు ఆలోచిస్తున్నారు. ఏపీలో కీలక బిందువుగా ఉంటూ.. పలు రంగాలకు కేంద్రంగా మారుతోన్న బెజవాడలో.. ఐటీ పరిశ్రమ నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. అయితే రాష్ట్ర విభజన తరువాత కంపెనీలన్నీ విశాఖ వైపు మొగ్గు చూపాయి. అంతర్జాతీయ స్థాయిలో విమానయాన సర్వీసులు అందుబాటులో ఉండడంతో పాటు.. ఇప్పటికే కొన్ని ఐటీ సంస్థలు ఉండడంతో ఐటీ పరిశ్రమలు ముందుగా విశాఖ వైపే చూశాయి.  అయితే హుదుద్ తుఫాన్‌ బీభత్సంతో ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు బెజవాడ వైపు మొగ్గు చూపుతున్నారని సమాచారం. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ.. అగ్రగామిగా నిలుస్తూ వర్తక, వాణిజ్యాలకు రాజధానిగా ఉన్న విజయవాడను ఐటీ హబ్‌గా కూడా తీర్చి దిద్దాలని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐటీ సంస్థలకు కావాల్సిన వసతులతో పాటు.. ప్రభుత్వం ఇస్తామన్న రాయితీలు, ప్యాకేజీలు త్వరగా ప్రకటిస్తే.. ఐటీ కంపెనీల ప్రతినిధులు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారని నాయకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: