ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో గెలిచిన భూమా అఖిల ప్రియ కొత్త రికార్డు సృష్టించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్రలోనే ఏకగ్రీవంగా గెలిచిన తొలి ఎమ్మెల్యేగా ఆమె ఘనత సాధించారు. ఎంట్రీయే ఇలా అదిరిపోవడంతో ఆమెకు రాజకీయాల్లో తిరుగులేని భవిష్యత్ ఉందని భూమా కుటుంబం అనుచరులు సంబరపడుతున్నారు. 50 ఏళ్ల ఆళ్లగడ్డ నియోజకవర్గ చరిత్రలో మొట్టమొదటిసారిగా మొన్నటి ఉప ఎన్నిక ఏకగ్రీవమైంది. వైసీపీ నేత శోభా నాగిరెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానానికి ఆమె కూతురు అఖిలప్రియ పోటీ చేశారు. రాష్ట్రంలోని ఎన్నికల సంప్రదాయం ప్రకారం టీడీపీ, కాంగ్రెస్‌లు పోటీ చేయలేదు. ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినా వారంతా ఉపసంహరించుకున్నారు. దీంతో భూమా అఖిలప్రియ ఏకగ్రీవంగా గెలిచారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గం 1962లో ఏర్పడింది. ఇప్పటివరకు ఇక్కడ 16 సార్లు ఎలక్షన్లు జరపగా ప్రధాన పార్టీలన్నీ పోటీ చేశాయి. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి శోభా నాగిరెడ్డి పోటీ చేశారు. ప్రచారానికి వెళ్లి వస్తూ ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎన్నికల ఏర్పాట్లు అప్పటికే పూర్తి కావడంతో ఈవీఎంలలో శోభానాగిరెడ్డి పేరును కొనసాగించారు. ప్రజలు కూడా ఆమెకే ఎక్కువ ఓట్లేయడంతో ఆమె గెలిచారు. అయితే, ఆమె మరణించడంతో లేకపోవడంతో మళ్లీ ఉప ఎన్నిక నిర్వహించారు. అయితే ఎమ్మెల్యేలు ఎవరైనా మరణిస్తే వారి స్థానంలో కుటుంబ సభ్యులు పోటీ చేస్తే ఇతర పార్టీలు పోటీ పెట్టరాదనే సంప్రదాయం ఉంది. దానికి ముగింపు పలుకుతూ ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని టీడీపీ, కాంగ్రెస్లు తొలుత భావించాయి. చివరి నిమిషంలో మనసు మార్చుకుని పోటీలో నిలపలేదు. సీపీఎం, సీపీఐ, బీజేపీ, ఎంఐఎం తదితర పార్టీలు పోటీ చేయలేదు. స్వతంత్రంగా పోటీ చేసిన వారు కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో అఖిల ఏకగ్రీవంగా ఎన్నికైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: