కొత్త రాజధానిపై తుది అడుగులు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజధాని ప్రాంతంలో భూమిని ఎలా సేకరించాలన్న అంశంపై గురువారం స్పష్టత ఇవ్వాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి గురువారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. రాజధాని ప్రాంతంలో భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని ఇప్పటికే నిర్ణయించారు. దీనికోసం ఇతర రాష్ట్రాల్లో గతంలో అనుసరించిన విధానాలను కూడా అధ్యయనం చేశారు. వీటిలో ఉన్నతమైన దానిని గుర్తించి రాష్ట్రంలో అమలు చేసేందుకు మంత్రులు, అధికారులు ఇప్పటికే కసరత్తు చేశారు. వారు తయారుచేసిన ముసాయిదా భూసేకరణ విధానంపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. భూముల సేకరణ, తరువాత ఆ భూమిని అభివృద్ధి చేసేందుకు అయ్యే వ్యయాన్ని కూడా ఆర్ధిక శాఖ అధికారులు మదింపు చేస్తున్నారు. అలాగే రైతులకు ఎంత చెల్లించాల్సి ఉంటుందన్న అంశంపై కూడా మదింపు చేస్తున్నారు. దీనిపై కూడా గురువారం మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా భూసేకరణపై త్వరగా మార్గదర్శకాలను సిద్ధంచేసి, రైతుల నుంచి ల్యాండ్‌పూలింగ్ ద్వారా భూమిని సేకరించాలని యోచిస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, నయా రాయపూర్, గాంధీనగర్‌లో అనుసరించిన ల్యాండ్ పూలింగ్ విధానాలకన్నా మెరుగైన విధానాలను రాష్ట్రంలో అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం అందుకు అనుగుణంగా మార్గదర్శకాలను సిద్ధం చేస్తోంది. ల్యాండ్ పూలింగ్‌లో రైతుకు ఎంత వాటా ఇవ్వాలన్నది కూడా గురువారమే నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతుకు అభివృద్ధి చేసిన భూమిని 40 శాతం వరకు అందించేందుకు అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీనిని కొంతవరకు పెంచినా ఆశ్చర్యం లేదని అధికారులు అంటున్నారు. వాస్తవంగా ఒక ఎకరా భూమిని అభివృద్ధి చేసేందుకు 60 నుంచి 70 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ ఖర్చు ఆధారంగానే రైతుకు వాటా ఎంత ఇవ్వాలన్నది నిర్ధారించే అవకాశాలున్నాయని సమాచారం. ఇదే సమయంలో రైతుల నుంచి సేకరించే భూమిలో ఎంత ఖాళీ స్థలంగా ఉంచాలి, రోడ్డు, వౌళిక సౌకర్యాలు, ఇతర అంశాలకు ఎంత భూమిని కేటాయించాలన్న అంశాలపై కూడా ఇప్పటికే కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. వీటన్నింటిపైనా నిశితంగా చర్చించి తుది మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదం ప్రకటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇదే సమయంలో రాజధాని ప్రాంతంలో అభివృద్ధి, నిర్మాణాలపై పలు రకాల మ్యాప్‌లను తయారుచేయడంలో కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. సచివాలయం ఎక్కడ ఉండాలి, శాసనసభ, ఇతర నిర్మాణాలు ఎక్కడ ఏర్పాటుచేయాలన్న అంశంపై అధికారులు తయారుచేస్తున్న మ్యాప్‌లను కూడా సమావేశంలో అధ్యయనం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: