ఏపీ సర్కారు రాజధాని కోసం భూసమీకరణపై దృష్టిపెట్టింది. సేకరించిన భూమిలో 40 శాతం ఇస్తామంటూ రైతులను దువ్వుతోంది. అంతేకాకుండా.. అప్పటివరకూ ఎకరానికి పాతికవేల కౌలు ఇస్తామని చెబుతోంది. దేశంలో ఇంతకంటే బెస్ట్ ప్యాకేజీలేనేలేదని చెబుతోంది. సర్కారు సంగతి ఇలా ఉంటే.. రాజధాని వస్తుందని భావిస్తున్న గుంటూరు జిల్లా పల్లెల్లోని రైతుల, భూముల యజమానులు గుండెల్లో గుబులు మొదలైంది. గుంటూరు రెవెన్యూ డివిజను పరిధిలోని మంగళగిరి- తుళ్లూరు మండలాల్లో 17 గ్రామాలను తొలివిడత భూసమీకరణ కోసం ఎంపిక చేశారు. ఇందులో అత్యధికంగా తుళ్లూరు మండలంలో 14 గ్రామాలు- మంగళగిరి మండలంలో మూడు గ్రామాలను మొదటి విడత భూసమీకరణ కోసం గుర్తించారు. తమ ప్రాంతానికే రాజధాని వచ్చిందన్న సంతోషం ఓవైపు.. ఏటా మూడు పంటలు పండే భూములు ఇకపై తమకుండబోవన్న విషాదం.. మరోవైపు..వారిని వెంటాడుతున్నాయి. రాజధాని విషయంలో.. పరిహారం విషయంలో రోజుకోవార్త వెలువడుతుండటంతో ఏది నమ్మాలో.. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ఈదశలో ఆర్డీఓ అధికారులు.. రాజధాని పల్లెల్లో సందడి చేస్తున్నరు. పరిహారం విషయంలో అవగాహన కల్పిస్తూ సదస్సులు నిర్వహిస్తున్నారు. తొలివిడతగా భూసమీకరణకు ఎంపిక చేసిన గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తోంది. ఇంతకూ సర్కారు ఇస్తానంటున్న పరిహారం తీసుకోవడం మంచిదా..లేక.. ఇది సరిపోదని ఎదిరించడం మంచిదా.. ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మరికొందరు రైతులు. మరికొందరు రైతులు రాజధాని కోసం ఏడాది పొడవునా పంటలు పండే భూములను కాకుండా ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేసుకోవాలని.. విజ్ఞప్తి చేస్తున్నారు. రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని- ఐతే రాష్ట్రంలో తీవ్ర కరవు కాలంలోనూ ప్రజలకు కాయగూరలను అందించి ఆదుకున్న తమ ప్రాంత భూములను తీసుకోవడంపైనే తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామాల వారీగా సభలు నిర్వహించి తమ భవిష్యత్తుకు స్పష్టమైన భరోసా ఇస్తే తప్ప తాము భూములను వదులుకునే దిశగా లేమని తెగేసి చెబుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: