మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడ్నావిస్‌ ప్రయాణం నల్లేరు మీద నడకేనా? మిత్రపక్షాలు ఓవైపు.. సిఎం పీఠంపై కన్నేసిన సొంతపార్టీ సీనియర్లు మరోవైపు,.. పక్కలో బల్లెంగా మారతారా? కర్నాటకలోని అనుభవాలు ఏం చెబుతున్నాయి. దేవేంద్ర ఫడ్నావిస్‌ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతున్నారు. చిన్న వయసులోనే గురువు నితిన్‌ గడ్కరీ అండదండలు.. ఆర్‌ఎస్‌ఎస్‌ ఆశీస్సులతో పదవిని దక్కించుకున్నారు. పార్టీలో యువకులకే అవకాశాలుంటాయని పదేపదే చెబుతున్న నరేంద్ర మోడీ - అమిత్‌షా ద్వయం కూడా ఫడ్నావిస్‌కే ఓటేసింది. సీనియర్లు రేసులో ఉన్నామని బహిరంగంగా ప్రకటించినా.. పెద్దగా అసమ్మతి లేకుండానే పదవికి చేరువయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్న ఫడ్నావిస్‌కు పాలనపై పట్టు సాధించడం ఆషామాషీ వ్యవహారం కాదు. ఫడ్నావిస్‌ను శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదించిన ఏక్‌నాధ్‌ ఖడ్సే, బలపరిచిన సుధీర్‌ మంగన్‌తివార్‌, వినోద్‌ తడ్వా, పంకజా ముండే అంతా సీఎం రేసులో పోటీపడ్డ నాయకులు. పైగా ఫడ్నావిస్‌ కంటే సీనియర్లున్నారు. వీరిని కలుపుకుని పోవడం కొత్త సిఎంకు కత్తిమీద సామే. ఇప్పటికే కష్టాలు మొదలయ్యాయి. కేబినెట్‌ కూర్పు తొలి సవాల్‌గా మారనుంది. కీలక శాఖలపై సీనియర్లు కన్నేశారు. ఎంత అధిష్టానం మద్దతున్నా.. మైనార్టీ ప్రభుత్వం కావడంతో ఏ మాత్రం అసమ్మతి స్వరం పెరిగినా అసలుకే ఎసరు వస్తుంది. తొలిసారి మహారాష్ట్రలో అధికార పీఠం ఎక్కుతున్న బీజేపీకి దక్షణాది, కర్నాటక అనుభవాలున్నాయి. అందిన అధికారాన్ని వర్గాలు, గ్రూపులు, అవినీతి అక్రమాలతో రోడ్డున పడేసుకున్నారు. మహారాష్ట్రలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటున్న ఫడ్నావిస్‌కు పాలనపైన పట్టు సాధించడం ఒక్కటే కాదు.. పార్టీని ఏకతాటిపై నడిపి బలోపేతం చేయాల్సిన బాధ్యత కూడా ఆయన భుజాలపై ఉంది. ఇందుకు సీనియర్ల సహకారం తప్పనిసరి. ప్రత్యేక విదర్భ రాష్ట్రానికి బీజేపీ అనుకూలమని, సాధించి తీరుతామని ఎన్నికల ప్రచారంలోనూ, అంతకుముందు ఫడ్నావిస్‌ ప్రకటించారు. ఇప్పుడు అధిష్టానం అండదండలతో సిఎంగా బాధ్యతలు తీసుకుంటున్న ఆయనపై ఒత్తిడి పెరుగనుంది. ప్రత్యేక వాదం అతిపెద్ద సవాల్‌గా మారనుంది. అదే ప్రాంతానికి చెందిన నాయకుడిగా ప్రత్యేక ఉద్యమాలు ఉపందుకుంటే మాత్రం కష్టాలు తప్పవు. ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఫడ్నావిస్‌ సమర్ధతకు పరీక్షగా మారనున్నాయి. అధిష్టానం, ఎమ్మెల్యేల అంచనాలకు ఏమాత్రం పనితీరు తగ్గినా సొంత పార్టీలో అసమ్మతీ రాగం పెరుగుతోంది. కుర్చీ లాక్కోవడానికి సీనియర్లు సిద్దంగా ఉంటారు. ముఖ్యమంత్రి పీఠం నల్లేరు మీద నడక కాదని ఆయనకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: