తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు శుక్రవారం జరిగిన కృష్ణారివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు సమావేశానికి హాజరై అందరినీ విస్మయ పరిచారు. అంతే కాకుండా బోర్డు సమావేశం ముందు తనదైన శైలిలో తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి వాదనలు వినిపించారు. కృష్ణారివర్‌బోర్డులో విద్యాసాగర్‌ రావు సభ్యులు కాకపోవటంతో ఆయన సమావేశంలో పాల్గొనటం పట్ల ఏపి ప్రభుత్వం వైపునుంచి అధికారులు అభ్యంతరం పెట్టారు. సభ్యులు కాని వారిని సమావేశాలకు ఎలా అనుమతిస్తారంటూ బోర్డు ఛైర్మన్‌ పండిట్‌ దృష్టికి తీసుకుపోయారు. అయితే బోర్డు ఛైర్మన్‌ పండింట్‌ విద్యాసాగర్‌రావు హాజరు పట్ల పెద్దగా ప్రతిస్పందించలేదని సమాచారం. దీంతో ఏపి అధికారులు అసలు సమస్య పక్కదోవ పడుతుందన్న అభిప్రాయంతో జల వాదనలపై దృష్టిని కేంద్రీకరించారు. నీటిపారుదల శాఖలో ఇంజనీర్‌గానే కాకుండా, కేంద్ర జలవనరుల సంఘంలో చీఫ్‌ ఇంజనీర్‌గా కూడా పనిచేసిన అపార అనుభవం ఉన్న విద్యాసాగర్‌రావు సమావేశంలో బలమైన వాదనలను వినిపించారు. శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్‌ ఉత్పత్తి కోసమే నిర్మించారని ప్రాజెక్టు డిజైన్‌లను సమావేశం ముందుంచారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కేసి కాలువకు తుంగబధ్ర జలాశయం నుంచి నీటిని కేటాయించిందని , శ్రీశైలం జలాశయంలో కేసీకాలువ పధకానికి హnక్కే లేదని వాదించారు. 69జీఓ ప్రకారం శ్రీశైలం జలాలను 834అడుగుల దాక విద్యుత్‌కు వినియోగించుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు.  విద్యాసాగర్‌ రావు వాదనలతో సమావేశం ఒక దశలో ఏకపక్షంగా తెలంగాణకు అనుకూలంగా జరుగుతోందా అన్న అభిప్రాయం కల్పించింది. ఏపి అధికారులు నిభంధనలు జీఓలు, పోతిరెడ్డిపాడు ద్వారా తాగు ,సాగునీటి అవసరాలకే పరిమితమై తమ వాదనలు వినిపించారు. సమావేశం అనంతరం విద్యాసాగర్‌ రావు తీరుపట్ల ఏపి అధికారులు నిరశన వ్యక్తం చేశారు. సభ్యులు కాని వారిని సమావేశానికి అనుమతించటమే కాకుండా వాదనలు వినిపించేందుకు కూడా అవకాశం ఇచ్చిన తీరును తప్పు పడుతూ ప్రభుత్వ ఉన్నతస్ధాయి వర్గాలకు సమాచారం అందచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: