రాజధాని నిర్మాణమంటే మాటలు కాదు.. భూములు సమీకరించాలి.. ప్లాన్లు ఓకే చేయాలి.. భూములు అభివృద్ది చేయాలి.. అందుకు రైతులను ఒప్పించాలి. వారికి ఎప్పటికప్పుడు పరిహారం చెక్కులు పంపిణీ చేయాలి. సమీకరించిన భూములను సద్వినియోగం చేయాలి. మరి ఇన్ని పనులు సరిగ్గా జరగాలంటే సర్కారు శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అది సాధ్యమయ్యే పనేనా.. అందుకే..రాజధాని నిర్మాణం కోసం ఓ స్పెషల్ డెవలప్ మెంట్ అథారిటీనే ఏర్పాటు చేయాలని ఏపీ సర్కారు డిసైడయ్యిందట. ఇప్పటికే భూసేకరణ విధి విధానాల ముసాయిదాను ఖరారు చేసిన ప్రభుత్వం... నెలరోజుల్లో ఈ స్పెషల్ అథారిటీని అందుబాటులోకి.. అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. ఈ సంస్థకు చట్టబద్ధత కల్పించడం ద్వారా రాజధాని భూసమీకరణను కూడా దీని పరిధిలోకి తీసుకొస్తారు. ఈ అథారిటీకి ఏకంగా ముఖ్యమంత్రే అధ్యక్షత వహిస్తారట. ఈ రాజధాని ప్రాంతీయ అభివృద్ధి సంస్థ ఏర్పాటుపై మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు పురపాలక, రెవెన్యూ, పంచాయితీరాజ్‌శాఖల కార్యదర్శులు కూడా ఈ అథారిటీలో మెంబర్లుగా ఉంటారు. ఈ స్పెషల్ డెవలప్ మెంట్ అథారిటీలో కేవలం అధికారులే కాకుండా ప్రజాప్రతినిధులకూ ప్రాతినిధ్యం కల్పించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సంస్థ ద్వారానే రాజధానికి అవసరమైన భూములు సమీకరిస్తారు. రైతులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వారికి చెల్లింపులు కూడా ఈ సంస్థ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తారు. అంతే కాదు... రైతుల నుంచి స్వీకరించిన భూమిని అభివృద్ధి చేసే బాధ్యత కూడా ఈ సంస్థదే. ప్రస్తుతానికి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని 14 గ్రామాలు, మంగళగిరి మండలంలోని 3 గ్రామాల నుంచి దాదాపు 30 వేల ఎకరాల భూమిని సమీకరిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: