మొండివాడు రాజు కన్నా బలవంతుడని ఓ సామెత. మరి మొండివాడే రాజైతే ఎలా ఉంటుంది. ఈ ప్రశ్నకు సమాధానమే నిలువెత్తు కేసీఆర్. అలాంటి కేసీఆర్ తో పెట్టుకున్న జూనియర్ డాక్టర్లకు ముందు ముందు కష్టాలు తప్పేలా లేవు. జూనియర్ వైద్యుల సమ్మె విషయంలో కఠిన చర్యలకు తెలంగాణ సర్కారు సిద్ధమవుతోంది. ఇక ఎంతమాత్రం ఉపేక్షించకూడదని భావిస్తోంది. రానున్న రోజుల్లో వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థులు రెండేళ్లపాటు గ్రామాల్లో తప్పనిసరిగా పనిచేస్తామని ప్రమాణపత్రం తీసుకోవాల్సిందేనని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆందోళన విరమించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా వినకుండా విధులను బహిష్కరించటాన్ని కేసీఆర్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అటు హైకోర్టు కూడా జూనియర్ల వైఖరిని తీవ్రంగా తప్పబట్టింది. విద్యార్థుల భవిష్యత్‌ దృష్ట్యా కఠిన చర్యలకు తీసుకోవటం లేదని వ్యాఖ్యానించింది. ఎవరికీ సానుభూతి లేకపోయినా.... తాము మాత్రం వారి భవిష్యత్‌ గురించిన ఆలోచిస్తున్నట్లు పేర్కొంది. సమ్మె వెనుక ఇతరుల ప్రమేయం ఏమైనా ఉందా అని ప్రశ్నించింది. జూనియర్‌ వైద్యుల సమ్మెపై హైకోర్టు తుదితీర్పు ఇవ్వనున్న తరుణంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య, అధికారి శ్రీనివాస్ న్యాయస్థానంలో జరిగిన వాదనలను వివరించారు. విద్యార్థి వైద్యులు వెంటనే విధుల్లోకి చేరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బెట్టు చేసిన వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధుల్లో చేరని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనా కేసీఆర్ చర్చించారు. గతేడాది విడుదల చేసిన జీవో.. 1022 ప్రకారం కోర్సుల నుంచి డిబార్ చేసే అధికారం ఉందని అధికారులు వివరించారు. గ్రామాల్లో రెండేళ్ల పాటు పనిచేస్తామంటూ వృత్తి విద్యా కోర్సులు చదివే విద్యార్థుల నుంచి ప్రమాణపత్రం తీసుకోవాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారట. హైకోర్టు తీర్పు ఇచ్చే వరకూ వేచి చూసి.. ఆ తర్వాత ఎస్మా ప్రయోగానికి సైతం వెనుకాడవద్దని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: