దాదాపు పది సంవత్సరాల పాటు నల్లేరు మీద నడకలా నడిచిపోయింది కాంగ్రెస్ పార్టీ కథ. కేంద్రంలో అధికారం లో ఉన్నంత సేపూ కాంగ్రెస్ ఆడింది ఆట పాడింది పాటగా సాగింది. అయితే ఒక్కసారిగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కి కష్టాలు అధికం అవుతున్నాయి. ఒక్కో కష్టమే వచ్చిపడుతున్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి ఎదురు కావడంతో కనీసం కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఆ విషయంలో ఏవో ప్రయత్నాలు కూడా చేసి.. ఎలాగూ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కదని అర్థంచేసుకొని కాంగ్రెస్ మిన్నకుండిపోయింది. ఆ తర్వాత వరసగా వివిధ రాష్ట్రాల్లోజరుగుతున్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కు ఎదురుదెబ్బలే. మహరాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. మరి ప్రజలు మార్పును కోరుకొంటున్నారు..అందుకే మమ్మల్ని పక్కనపెడుతున్నారని కాంగ్రెస్ అధిష్టానం తమను తాము ఓదార్చుకొంటోంది. అయితే పటిష్టమైన ప్రభుత్వంగా మారిన మోడీ సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ కు చుక్కలు చూపుతోంది. అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కు కష్టాల రుచిని చూపిస్తోంది. తాజాగా ఇందిరగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా జరపకూడదని నిర్ణయించింది మోడీ ప్రభుత్వం. ఇందిరగాంధీ, రాజీవ్ గాంధీ తదితర కాంగ్రెస్ ప్రధానమంత్రుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఎలాంటి వేడుకగా నిర్వహించకూడదని మోడీ సర్కార్ నిర్ణయించింది. కేవలం గాంధీజీ, సర్ధార్ వల్లభాయ్ పటేల్ ల జయంతి, వర్ధంతి కార్యక్రమాలు మాత్రమే ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ నేతలు ఉడికిపోతున్నారు. మోడీ తీరుపై మండిపడుతున్నారు! అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: