పిల్లికి చెలగాటం- ఎలుకకు ప్రాణ సంకటం అంటారే- ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి అలానే ఉంది. రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య రాజకీయ ఆధిపత్య పోరులో తెలంగాణ రైతులు కరెంట్‌ కోసం నలిగిపోతున్నారు. ఒకవైపు ఎండిపోతున్న పంటలు, మరోవైపు తరుముకొస్తున్న అప్పులతో రైతులు ఉసురు తీసుకుంటున్నారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకొచ్చాక 250 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని శుక్రవారం నాటి విలేకరుల సమావేశంలో ఒకరు గుర్తుచేయగా, ఆంధ్రాలో 1,500 మంది చనిపోయారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆగ్రహంగా సమాధానం ఇచ్చారు. వాస్తవానికి ఏపీలో రైతుల ఆత్మహత్యలు ఉన్నా చాలా తక్కువ. అయినా అక్కడ చనిపోతున్నారు కనుక ఇక్కడ చనిపోయినా పర్వాలేదు అని కేసీఆర్‌ భావిస్తే చేయగలిగింది ఏమీ లేదు. తెలంగాణలో రోజుకు సగటున ఇద్దరు ముగ్గురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. దీపావళి పండుగ రోజు కూడా తెలంగాణలో అయిదారుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ మరణాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే కారణమని నిందించలేం. అయితే ఒక ముఖ్యమంత్రిగా రైతులలో ఆత్మస్థయిర్యం నింపే చర్యలు తీసుకోవడంలో మాత్రం ఆయన విఫలమయ్యారనే చెప్పాలి. గడచిన రెండు నెలలుగా ఆత్మహత్యలకు సంబంధించిన వార్తలు పత్రికలలో వస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోంది. పైపెచ్చు రైతుల ఆత్మహత్యలను ఆంధ్రా మీడియా ఎక్కువ చేసి చూపిస్తోందంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. ఇంకా నయం మీరే చంపుతున్నారు అని అనడంలేదు. మీడియాను బెదిరించి ఆత్మహత్యల వార్తలను బయటకురాకుండా కట్టడి చేయాలనుకోవడం నిప్పును కొంగున బిగించడమే అవుతుంది. బాధ్యతగల ప్రభుత్వమైతే ఇలాంటి పరిస్థితిలో రైతులలో భరోసా కల్పించడానికి కనీస చర్యలు తీసుకుంటుంది. రైతుల ఆత్మహత్యల గురించి స్పందించే తీరిక కూడా లేనంత బిజీగా కేసీఆర్‌ ఉన్నారనుకుందాం. కనీసం ఆయన కార్యాలయం నుంచి అయినా రైతుల్లో మనోధైర్యం కల్పించేలా ఒక ప్రకటనను విడుదల చేయవచ్చు కదా! పల్లెల్లో చావు డప్పు మోగుతూ ఉంటే ‘బంగారు తెలంగాణ’ అంటూ ముఖ్యమంత్రి చెప్పే మాటలు వినసొంపుగా ఉండవు. 12 ఏళ్ల తెలంగాణ ఉద్యమంలో వెయ్యి మంది వరకు బలిదానాలు చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఈ సంఖ్య అయిదు వందలలోపే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ నాలుగైదు నెలల కాలంలోనే దాదాపు మూడు వందల మంది రైతులు ఉసురు తీసుకున్నారు. తెలంగాణలో పరిస్థితి విషమించడానికి విద్యుత్‌ కొరతే ప్రధాన కారణం. రాష్ట్రం విడిపోతే తెలంగాణలో విద్యుత్‌ కొరత తీవ్రంగా ఉంటుందని విభజనకు ముందే అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెబుతున్నట్టు మూడేళ్ల తర్వాత రెప్పపాటు కూడా కరెంట్‌ పోని పరిస్థితి తెలంగాణలో ఉండదు. మూడేళ్లే కాదు అయిదు పదేళ్లు అయినా తెలంగాణను విద్యుత్‌ కొరత వెంటాడుతూనే ఉంటుంది. అయినా ముఖ్యమంత్రి చెబుతున్న మూడేళ్లలో అప్పుడే అయిదు నెలల కాలం కరిగిపోయింది. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తయితే కొన్ని వేల మెగావాట్ల విద్యుత్‌ అవసరమవుతుంది. దీనికితోడు ప్రభుత్వం తలపెట్టిన వాటర్‌ గ్రిడ్‌ పథకం ఉండనే ఉంది. ముఖ్యమంత్రి ఇప్పుడు చెబుతున్న ప్రతిపాదిత విద్యుత్‌ ప్రాజెక్టులన్నీ పూర్తి అయ్యి విద్యుత్‌ ఉత్పత్తి అయినా అది నీటిపారుదల ప్రాజెక్టులకే సరిపోతుంది. ఈలోపు విద్యుత్‌ డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది. కొత్తగా ఏర్పడే తెలంగాణలో మూడేళ్లపాటు విద్యుత్‌ కొరత ఉంటుందని ఎన్నికలకు ముందే చెప్పానని కేసీఆర్‌ చెబుతున్నది నిజమే! అంత మాత్రాన మూడేళ్లపాటు రైతులు పంటలను ఎండబెట్టుకోలేరు కదా! తనకు చాలా ముందుచూపు ఉందని ముఖ్యమంత్రి చెబుతున్నది నిజమైతే పొరుగు రాష్ట్రమైన ఏపీలో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు జరగ్గా, తెలంగాణ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోయింది? అందుబాటులో ఉన్న గ్రిడ్‌ సామర్థ్యాన్ని ఏపీ ప్రభుత్వం ముందుగానే బుక్‌ చేసుకుంది. అదే సమయంలో గ్రిడ్‌ సదుపాయం పొంది ఉన్న ప్రయివేటు విద్యుత్‌ ప్రాజెక్టులతో కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటున్నది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో మిగులు విద్యుత్‌ సాధించి, ఆ విద్యుత్‌ను తెలంగాణకు సరఫరా చేయడం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీని పటిష్ఠం చేసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రణాళిక రచించుకున్నారు. ఇటువంటి వ్యూహాలను అమలుచేయవలసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులను తన పార్టీలో చేర్చుకోవడం ద్వారా టీఆర్‌ఎస్‌ను పటిష్ఠం చేసుకోవడంపై దృష్టి కేంద్రీకరించారు. రాజకీయాలలో ఇటువంటి వ్యూహ రచన చేసే హక్కు ఒక పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్‌కు ఉంటుంది. అయితే అదే సమయంలో ప్రజల్లో ఫీల్‌ గుడ్‌ భావన కలిగేలా ప్రభుత్వపరంగా కూడా చర్యలు తీసుకుంటుంటే పరిస్థితి మరోలా ఉండేది. తెలంగాణలో పెట్టుబడుల వరద ప్రవహించబోతోందని ముఖ్యమంత్రి కార్యాలయం ఆ మధ్యన ఒక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్లపాటు కరెంట్‌ లభించని రాష్ట్రంలో ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఇలాంటి ప్రకటనలు ఆత్మ వంచన కిందకే వస్తాయి. ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు గ్రిడ్‌ సామర్థ్యం ఎంత ఉంది? పొరుగు రాష్ర్టాలలో కొత్త విద్యుత్‌ ప్రాజెక్టులు ఎన్ని వస్తున్నాయి? రానున్న రెండు మూడేళ్లలో ఎంత కరెంట్‌ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? మొదలైన వివరాలను ముందుగానే సేకరించి పకడ్బందీ వ్యూహంతో కేసీఆర్‌ ముందుకు వెళ్లి ఉంటే వచ్చే ఏడాది నుంచైనా విద్యుత్‌ సంక్షోభాన్ని కొంతలో కొంత అరికట్టగలిగేవారు. దేశంలోనే మొదటిసారిగా విద్యుత్‌ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబుకు విద్యుత్‌ వ్యవహారాలపై పూర్తి పట్టు ఉంది. ఈ విషయంలో కేసీఆర్‌ను చంద్రబాబుతో పోల్చలేం. రాజకీయ వ్యూహరచన చేయడంలో మాత్రం కేసీఆర్‌ దిట్ట అనే చెప్పాలి. పాలనాపరమైన అంశాల విషయానికి వస్తే ఆయన ఇంకా అవగాహన పెంచుకోవాలి. లేడికి లేచిందే పరుగు అన్నట్టుగా తనకు తోచిన ఆలోచనలను అప్పటికప్పుడు ప్రకటించే కేసీఆర్‌, అవన్నీ అమలు జరిగిపోయినట్టుగా భావిస్తారు. ఉద్యమ సందర్భంలో కూడా ప్రజలను ఆకర్షించడానికి ఆయన అద్భుతంగా మాట్లాడేవారు. ప్రజలను తనవైపునకు తిప్పుకోవడానికి ఏమి చేయాలో, ఎలా మాట్లాడాలో తనకు బాగా తెలుసునని కేసీఆర్‌ భావిస్తుంటారు. ఇప్పటివరకు ఆయన ఈ విషయంలో సఫలీకృతులయ్యారు. ఇప్పుడు ఆయన పాత్ర మారింది. ప్రస్తుతం కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి. ఇది బాధ్యతతో కూడిన పాత్ర. ప్రభుత్వ చర్యల ఫలితాలను ప్రజలకు చూపించవలసి ఉంటుంది. మాటలతో ప్రజలు సంతృప్తి చెందరు. తాను హిట్లర్‌ తాతనని కేసీఆర్‌ సగర్వంగా ప్రకటించుకోవడం గమనించిన ఒక విదేశీయుడు ఒక సందేహం వ్యక్తంచేశారు. హిట్లర్‌ గురించి కేసీఆర్‌కు తెలుసా? పాశ్చాత్య దేశాలతోపాటు యూరప్‌ దేశాలన్నీ ద్వేషించే హిట్లర్‌తో పోల్చుకోవడం ద్వారా తన గురించి విదేశీయులు ఏమనుకుంటారోనని కూడా కేసీఆర్‌ ఎందుకు ఆలోచించలేకపోయారు అని సదరు విదేశీయుడు ప్రశ్నించారు. రసవత్తర రాజకీయ క్రీడ! ---------------------------- ఈ విషయం అలా ఉంచి కరెంట్‌ విషయమై ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రుల మధ్య జరుగుతున్న లడాయి విషయానికి వద్దాం. ఈ అంశంపై రెండు తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల వాదనలను విన్నాం. ఎవరి వాదనలను వారు సమర్థించుకుంటూ గణాంకాలను కూడా వివరించారు. పరిస్థితికి అనుగుణంగా గణాంకాలను తయారుచేసి ఇవ్వడంలో మన అధికారులు సిద్ధహస్తులు. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం సాధ్యంకాదనీ, దానివల్ల జరిగే అనర్థాన్ని వివరిస్తూ అధికారులు గణాంకాలు రూపొందించారు. తర్వాత రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే అధికారులు ఉచిత విద్యుత్‌ను భేషుగ్గా అందించవచ్చునంటూ గణాంకాలను రూపొందించారు. ఏపీలో పనిచేస్తున్న అధికారులను తెలంగాణకు కేటాయిస్తే ఆ రాష్ర్టానికి అనుకూలంగా పత్రాలను తయారుచేయగలరు. శుక్రవారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరాలు అందచేసిన అధికారులను ఏపీకి కేటాయిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి లెక్కలన్నీ తప్పు అని నమ్మేలా వాదించగలరు. అందుకే ప్రభుత్వాల వాదనలు, గణాంకాలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు, కె.చంద్రశేఖర్‌రావు విద్యుత్‌ విషయంలో తమ తమ వాదనలు వినిపించారు. వాటిని కాసేపు పక్కనపెడదాం. ఈ వ్యవహారం ముదరడానికి ‘రాజకీయం’ ప్రధాన కారణం. ఎవరి రాజకీయ క్రీడను వారు రసవత్తరంగా ఆడుతున్నారు. ఆంధ్రా వ్యతిరేక భావాలను వ్యాపింపజేసి తెలంగాణ ప్రజల మనస్సు చూరగొనడానికి కేసీఆర్‌ ప్రయత్నించారు. కేంద్ర ప్రభుత్వం వద్ద తనకున్న పలుకుబడితో తెలంగాణ వాదన చెల్లుబాటు కాకుండా చేయడం ద్వారా కేసీఆర్‌ ప్రభుత్వాన్ని చంద్రబాబు ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‌ రెండు వ్యూహాత్మక తప్పిదాలు చేశారు. మొదటిది కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వంతో పోరు పెట్టుకోవడం. ఒకప్పుడు కేంద్రంతో ఘర్షణపడడాన్ని హీరోయిజంగా చూసేవారు. దేశం మొత్తం కాంగ్రెస్‌ పార్టీ ఏకఛత్రాధిపత్యం కింద ఉన్నప్పుడు కాంగ్రెస్‌ వ్యతిరేకత ప్రాతిపదికన రాజకీయాలు సాగేవి. 1982లో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన ఎన్‌.టి.రామారావు కాంగ్రెస్‌ వ్యతిరేకత ఆధారంగానే అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కూడా ఆయన కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయాలు నడిపారు. కేంద్రం మిథ్య అనే వరకు వెళ్లారు. అప్పట్లో ఆర్టికల్‌ 356ను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వాలను తరచుగా రద్దు చేసేవారు. దీంతో కేంద్రం మిథ్య అని ఎన్‌.టి.ఆర్‌. ప్రకటించినా ఆయనను ఎవరూ తప్పుబట్టలేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వివిధ రాజకీయ పార్టీలన్నింటినీ ఒక వేదిక మీదకు తీసుకువచ్చి నేషనల్‌ ఫ్రంట్‌ స్థాపించిన ఘనత ఎన్‌.టి.ఆర్‌.ది! 1984లో తనను అధికారంలోంచి తొలగించిన కాంగ్రెస్‌ పార్టీని కేంద్రంలో అధికారం నుంచి తొలగించడం ద్వారా ఎన్‌.టి.ఆర్‌. ప్రతీకారం తీర్చుకున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఆర్టికల్‌ 356ను దుర్వినియోగం చేయడం లేదు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి. కేంద్ర సహకారం లేకుండా రాష్ర్టాలు అభివృద్ధి చెందలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంలోని అధికారులను, మంత్రులను లాబీయింగ్‌ ద్వారా మచ్చిక చేసుకుని తమ రాష్ర్టానికి కావలసినవి సాధించుకుంటున్నాయి. నరేంద్ర మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఘర్షణ పడినప్పటికీ, అధికారుల వద్ద లాబీయింగ్‌ చేసుకోవడం ద్వారా తన రాష్ర్టానికి కావలసినవి దక్కించుకునేవారు. అదే నరేంద్ర మోదీ ఇప్పుడు దేశ ప్రధాని అయ్యారు. దేశవ్యాప్తంగా ఇప్పుడు మోదీ అనుకూల పవనాలు వ్యాపించాయి. భారతీయ జనతా పార్టీలో ఆయన తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. మహారాష్ట్ర, హర్యానాలలో బీజేపీని ఒంటి చేత్తో విజయ తీరాలవైపు చేర్చడం ద్వారా దేశంలోనే ఆయన అత్యంత బలమైన నాయకుడిగా ఎదిగారు. ఈ పరిస్థితులలో ప్రధాని మోదీతో సఖ్యత నెరపవలసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయనను నువ్వెంత అన్నట్టుగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక స్వతంత్ర దేశం అనీ, దానికి తాను వంశ పారంపర్య హక్కు కలిగిన రాజుననీ కేసీఆర్‌ భ్రమించడం మొదలెట్టారు. ఈ ధోరణి తెలంగాణకు శాపంగా మారింది. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులకే కాదు- తెలంగాణ ఉద్యమానికి మద్దతు పలికిన ఎన్‌.సి.పి. అధినేత శరద్‌పవార్‌ వంటి వారికి కూడా కేసీఆర్‌ పట్ల ఇప్పుడు సదభిప్రాయం లేదు. ఇక కేసీఆర్‌ చేసిన రెండవ తప్పు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఘర్షణకు దిగడం. తెలంగాణ రాష్ట్రం బలం, బలహీనతల గురించి తనకు బాగా తెలుసునని కేసీఆర్‌ అంటారు. అదే నిజమైతే ఆయన ఏక కాలంలో ప్రధాని మోదీతో, ఏపీ సీఎం చంద్రబాబుతో కొట్లాటకు దిగి ఉండేవారు కాదు. శ్రీశైలం జల విద్యుత్‌ వివాదమే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతితో మాట్లాడి, కృష్ణా వాటర్‌ బోర్డు చైర్మన్‌ను హైదరాబాద్‌ పిలిపించుకున్నారని కేసీఆరే స్వయంగా శుక్రవారంనాడు విలేకరుల సమావేశంలో చెప్పారు. చంద్రబాబు ఈ పని చేయకపోతే ఆశ్చర్యపోవాలి గానీ, చేస్తే ఆశ్చర్యపోవడం ఎందుకు? విద్యుత్‌ ఒప్పందాలను అమలు చేయకూడదని చంద్రబాబు నిర్ణయించడం వల్ల తెలంగాణకు కరెంట్‌ కొరత మరింత పెరిగిన విషయం వాస్తవం. ఈ నిర్ణయం సరికాదని ఏపీ రెగ్యులేటరీ కమిషన్‌తో పాటు, సెంట్రల్‌ ఎలక్ర్టిసిటీ అథారిటీ అభిప్రాయపడిన విషయం కూడా వాస్తవం. అయితే చంద్రబాబు తన పలుకుబడి ప్రయోగించి సెంట్రల్‌ ఎలక్ర్టిసిటి అథారిటీ తన అభిప్రాయం మార్చుకునేలా చేసుకున్నారు. ఈ చర్య వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉండవచ్చు. అయితే ఏపీ ముఖ్యమంత్రి పాత్రలో ఆయన రాజకీయంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారు. నాయకులు రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు తమను అధికారంలో కూర్చోబెట్టిన ప్రజలకు మేలుచేసేలా ఉండాలి గానీ కీడు చేసేవిగా ఉండకూడదు. కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య జాన్‌ దోస్తీ ఏమీ లేదు. గోయల్‌ అవసరం ఉంది కనుక ఆయన వద్ద మంచి మార్కులు కొట్టేయడానికి చంద్రబాబు ప్రతి అవకాశాన్నీ ఉపయోగించుకున్నారు. ఉత్తరాదివారు శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనాన్ని మహద్భాగ్యంగా భావిస్తారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే పీయూష్‌ గోయల్‌ తిరుమల వెళ్లినప్పుడు ఆయనకు అద్భుతంగా దర్శనం జరిగేలా చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇవన్నీ ఒక ముఖ్యమంత్రి చేయాలా? అని ప్రశ్నిస్తే అవసరం లేదనే అంటాం. అయితే విభజిత తెలుగు రాష్ర్టాల పాలకులకు పబ్లిక్‌ రిలేషన్స్‌ నెరపడం ఎంతో అవసరం. అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించి తమ రాష్ర్టాలను అభివృద్ధి బాటలో పయనింపజేయాలంటే ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు లాబీయింగ్‌ చేసుకోక తప్పని పరిస్థితి. అయితే కేసీఆర్‌ తన సహజ శైలి ప్రకారం చంద్రబాబుతో మొదటి రోజు నుంచి ఘర్షణకు దిగుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్‌ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. హుద్‌హుద్‌ తుఫాను సంభవించినప్పుడు పలు పొరుగు రాష్ర్టాల సీఎంలు ఏపీ సీఎం చంద్రబాబును ఏమైనా సహాయం కావాలా? అని వాకబు చేశారు. చంద్రబాబు కూడా వారందరికీ ఫోన్‌లు చేసి తనకు కావలసిన సహాయం పొందారు. అయితే 60 ఏళ్లపాటు ఒకే రాష్ట్రంగా కలిసి ఉన్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు మాత్రం మాట్లాడుకోలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్‌ చేసి పలకరించి ఉండవలసింది. ఆయన అలా చేయకుండా ఏపీకి ఏమైనా సహాయం కావాలేమో కనుక్కోండి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. దీంతో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కూడా మాట్లాడిన చంద్రబాబు, తెలంగాణ సీఎంతో మాట్లాడలేదు. ఇద్దరి మధ్య పరిస్థితి ఇంతలా ఉప్పు-నిప్పులా ఉండటం అవసరమా? తుఫాను తాకిడికి గురైన విశాఖపట్టణంలో పర్యటించడానికి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విమానాశ్రయంలో చంద్రబాబు ఎలా స్వాగతం పలికారో గమనించండి. రాజు ముందు సామంత రాజులా ఆయన వంగిపోయి మరీ ప్రధానికి నమస్కరించారు. నిజానికి మోదీ కంటే ముందే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. మోదీ బలమైన నాయకుడు. అలాంటి వ్యక్తి ముందు వంగి నమస్కరించడం వల్ల వచ్చే అవమానం ఏమీ లేదు. మంచి చేసుకోవడం ద్వారా వీలైనంత ఎక్కువ సహాయం పొందాలన్న తాపత్రయంతో చంద్రబాబు అలా వ్యవహరించారు. ప్రస్తుత పరిస్థితులలో ప్రధాని మోదీతో పెట్టుకుంటే నష్టమే తప్ప లాభం ఉండదు. మహారాష్ట్రలో శివసేన ఉదంతమే తీసుకుందాం. బీజేపీతో శివసేన బంధం పాతికేళ్ల నుంచి ఉంది. అయినా అలాంటి పార్టీతో తెగతెంపులు చేసుకోవడానికి కూడా మోదీ వెనుకాడలేదు. ఒంటరిగా పోటీ చేయడం ద్వారా మహారాష్ట్రలో శివసేనతో పోల్చితే బీజేపీనే పెద్ద పార్టీ అని ప్రధాని ప్రపంచానికి తెలియజేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ-శివసేన పొత్తు మళ్లీ వికసిస్తుందని అందరూ భావించారు. ఇక్కడ కూడా మోదీ తన శైలి ఏమిటో, తన రాజకీయం ఎలా ఉంటుందో చూపించారు. ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన సహకారం తీసుకోవడానికి ఆయన ఉబలాటపడటం లేదు. శివసేన తనకు తానుగా మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తే స్వీకరించాలని ప్రధాని నిర్ణయించుకున్నారు. శివసేన అలా ముందుకు రానిపక్షంలో మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటుచేస్తాం. ఇష్టం లేకపోతే పడగొట్టుకోండి అని శివసేనకు సవాల్‌ విసరబోతున్నారు. దీర్ఘకాలిక స్నేహితుడితోనే నరేంద్ర మోదీ అంత కచ్చితంగా వ్యవహరిస్తున్నారంటే ఆయన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసుకుని మసలడం ఇతరులకు మంచిది. పరస్పర సహకారంతోనే పురోగమనం ----------------------------------------- దీన్ని గుర్తించకుండా, ఎవరైతే నాకేంటి- నేనే రాజు - నేనే మంత్రి అని భావిస్తున్న కేసీఆర్‌ మాత్రం మోదీ ఆగ్రహానికి గురయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణకు సైతాన్‌లా దాపురించారని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఘాటుగా విమర్శించారు. ఇది నిజమే అనుకుందాం. సైతాను పీడ నుంచి ప్రజలను విముక్తి చేయలేనప్పుడు సైతానును రెచ్చగొట్టడం ఎందుకు? అటు కేంద్రం, ఇటు ఏపీ ప్రభుత్వంతో సహకారం లేని పక్షంలో తెలంగాణలో విద్యుత్‌ సంక్షోభం చల్లారదు. రైతుల ఆత్మహత్యలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. చంద్రబాబు గొప్పవాడు, చంద్రశేఖర్‌రావు కాదని చెప్పడం నా ఉద్దేశం కాదు. పరిస్థితిని బట్టి లౌక్యంగా వ్యవహరించడం అవసరమని కేసీఆర్‌కు చెప్పడమే నా ఉద్దేశం. చంద్రబాబుది దొంగ చూపు అయితే తనది ముందు చూపు అని కేసీఆర్‌ చెప్పుకొన్నారు. చంద్రబాబువి దొంగ చూపులే కావచ్చు. అయితే తన చర్యల వల్ల తాను ఏలుతున్న ఏపీ ప్రజలు ఇబ్బందిపడకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. ముందు చూపు తనకుందని చెప్పుకొంటున్న కేసీఆర్‌, తెలంగాణలో కరెంట్‌ సమస్యను కొంతలో కొంతైనా ఎందుకు పరిష్కరించలేకపోయారన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. మొత్తంమీద తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముప్పుతిప్పలు పెట్టడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అధినేతగా, కేంద్ర ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉన్న నేతగా తెలంగాణ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ క్రీడలో తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారు. ఉభయ రాష్ర్టాల మధ్య సఖ్యత ఏర్పడకపోతే రానున్న రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు మరింత నష్టపోతారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు అవిభక్త కవలల వంటివి. పరస్పర సహకారం ఉంటేనే అవి పురోగమించగలవు. ఉభయ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని విజ్ఞత ప్రదర్శిస్తే తెలంగాణ ప్రజల కష్టాలు కొంతైనా తీరతాయి! తెలుగు రాష్ర్టాల పాలకులకు పబ్లిక్‌ రిలేషన్స్‌ నెరపడం ఎంతో అవసరం. అటు తెలంగాణ, ఇటు ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించి తమ రాష్ర్టాలను అభివృద్ధి బాటలో పయనింపజేయాలంటే ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు లాబీయింగ్‌ చేసుకోక తప్పని పరిస్థితి. అయితే కేసీఆర్‌ తన సహజ శైలి ప్రకారం చంద్రబాబుతో మొదటి రోజు నుంచి ఘర్షణకు దిగుతున్నారు. దాన్ని అలుసుగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం ద్వారా కేసీఆర్‌ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టే విధంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు.తెలుగుదేశం పార్టీని తెలంగాణలో ముప్పుతిప్పలు పెట్టడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తుండగా, ఏపీ ప్రభుత్వ అధినేతగా, కేంద్ర ప్రభుత్వం వద్ద పలుకుబడి ఉన్న నేతగా తెలంగాణ ప్రభుత్వాన్ని చికాకు పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సాగుతున్న ఈ క్రీడలో తెలంగాణ ప్రజలే నష్టపోతున్నారు. ఉభయ రాష్ర్టాల మధ్య సఖ్యత ఏర్పడకపోతే రానున్న రెండు మూడు సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు మరింత నష్టపోతారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టాలు అవిభక్త కవలల వంటివి. పరస్పర సహకారం ఉంటేనే అవి పురోగమించగలవు.

మరింత సమాచారం తెలుసుకోండి: