విభజన జరిగిన నేపధ్యంలో విజయవాడను రాష్ట్ర రాజధానిగా చూడాలనే చిరకాల వాంఛ ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతున్నది. కృష్ణానదీ తీరాన గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం మంగళగిరి, తుళ్ళూరు మండలాల్లో 17 గ్రామాల పరిధిలో దాదాపు 30వేల ఎకరాల భూమిని సమీకరించడం లేదా సేకరించడం జరుగుతుందంటూ ఇప్పటికే స్పష్టం చేసింది. రాజధాని నిర్మాణం అటుంచితే ముందుగా విజయవాడలో రాజధాని ప్రభావం కన్పించేలా ప్రభుత్వం వడివడిగా అడుగులేస్తున్నది. సిఎం చంద్రబాబు సగటున ప్రతి వారం కనీసం రెండుసార్లయినా విజయవాడ వచ్చి వెళుతున్నారు. డిజిపిరాముడు, ఇతర శాఖల మంత్రులు ఇక్కడే రాష్టస్థ్రాయి సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. దీంతో ప్రభుత్వ అతిధి గృహాలన్నీ నిత్యం సందడిగా కన్పిస్తున్నాయి.  ఈనెల 21 తేదీ గన్నవరంలో రాష్ట్ర రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ప్రారంభించిన సిఎం ఇక ఇక్కడ నుంచి ఈ సంస్థ తన కార్యకలాపాలను సాగించనున్నదని ప్రకటించారు. అతి త్వరలోనే అగ్నిమాపక శాఖ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం కాబోతున్నది. అడిషనల్ డిజి నండూరి సాంబశివరావు నేతృత్వంలో కాలువగట్టున రెండంతస్తులలో భవన నిర్మాణం పూర్తయి ముస్తాబవుతున్నది. తాజాగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 30 ఏళ్ల చరిత్ర కల్గిన ఉడా సంస్థను రద్దుచేస్తూ ఆ స్థానంలో క్యాపిటల్ రీజియన్ అభివృద్ధి సంస్థ ఏర్పాటుకు కీలక నిర్ణయం తీసుకుంది. గడచిన ఐదు మాసాల్లో విజయవాడలోనే ప్రభుత్వపరంగా కార్యక్రమాలనేకం జరిగాయి. ఆగస్టు 7న కలెక్టర్లు, ఐపిఎస్ అధికారులతోను వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏడు మిషన్‌ల రూపకల్పనకు శ్రీకారం చుట్టారు. మంత్రి దేవినేని ఉమ నీటిపారుదల శాఖ క్యాంప్ కార్యాలయాన్ని ప్రారంభించి తరచూ అక్కడ రాష్టస్థ్రాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అగ్నిమాపక శాఖ, భూగర్భ గనులశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య, ఆరోగ్యశాఖ, బిసి సంక్షేమ శాఖ తదితర శాఖల రాష్టస్థ్రాయి సమీక్ష సమావేశాలు నగరంలో జరిగాయి. విశేషం ఏమిటంటే విజయవాడ కేంద్రంగా సప్తగిరి ఛానెల్‌ను సిఎం, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఇలా నూతన సంవత్సరం ఆరంభం లోపే రానున్న రెండు మాసాల్లో కొన్ని కీలక కార్యాలయాలు తరలిరానున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: