ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు స్థిరంగా(పెరుగుదల లేదు..తరుగుదలలేదు) ఉన్నాయని జాతీయ హౌసింగ్ బ్యాంక్ తన త్రైమాసిక రిపోర్ట్ లో స్పష్టం చేసింది. అయితే, అదే సమయంలో... నవ్యాంధ్ర నూతన రాజధాని విజయవాడలో మాత్రం ధరలు క్రమంగా పెరుగుతున్నాయని ఆ సంస్థ తన రిపోర్ట్ లో పేర్కొంది. ఎన్‌హెచ్‌బీ 2007 జూలై నుంచి ప్రతి మూడు నెలలకోసారి దేశంలోని ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరల మీద ‘రెసిడెక్స్‌’ను(రిపోర్ట్) రూపొందిస్తోంది. జాతీయ హౌసింగ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోల్చితే... రెండో త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో దేశంలోని 18 ప్రధాన నగరాల్లో ఇళ్ల ధరలు బాగా పెరిగాయి. హౌసింగ్‌ ధరలు పెరుగుతున్న జాబితాలో పుణె (3.9శాతం) దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. విజయవాడలో 1.88 శాతం పెరుగుదల కనిపించింది. ఇంకా... ముంబై, చెన్నై, లూధియానా, భోపాల్‌, కొచ్చి, జైపూర్‌, ఫరీదాబాద్‌, బెంగళూరు, నాగపూర్‌, భువనేశ్వర్‌లలో ధరలు పెరిగాయి. చండీగఢ్‌, మీరట్‌, ఢిల్లీ, సూరత్‌, డెహ్రాడూన్‌, లఖ్‌నవ్‌లలో ధరలు తగ్గాయి. రాయ్‌పూర్‌, హైదరాబాద్‌లో మాత్రం హౌసింగ్‌ ధరలలో పెరుగుదల కనిపించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: