రాష్ట్ర విభజన వేళ ఏపీకి కలిగిన ఒకే ఒక ఊరట పోలవరం.. ఆంధ్రుల దశాబ్దాల కలగా మిగిలిన ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి.. కేంద్ర నిధులతో నిర్మించేందుకు కేంద్రం అంగీకరించడం విశేషం. దాదాపు ఐదు జిల్లాల తాగు, సాగు నీటి కష్టాలు తీర్చే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్టు అసలు సామర్థ్యం.. 307 టీఎంసీలు.. పోలవరం నిర్మాణం ద్వారా.... 164.90 టీఎంసీలను సాగునీటికి వినియోగించడంతో పాటు తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకు 23.44 టీఎంసీలు..., కృష్ణా బేసిన్‌కు 80 టీఎంసీల మళ్లింపు, అంతా కలిపి 307 టీఎంసీల నీటి వినియోగానికి వీలుగా పోలవరం నిర్మాణాన్ని 2004లో ప్రభుత్వం ప్రారంభించింది. బ్యారేజీ నిల్వ సామర్థ్యం 194 టీఎంసీలు. ఐతే.. 300పైచిలుకు టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ పోలవరం ప్రాజెక్టును మరింతగా విస్తరించాలని ఏపీ సర్కారు భావిస్తున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ ప్రాజెక్టు వినియోగ సామర్థ్యాన్ని 500 టీఎంసీలకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. తన ఆలోచనను నీటిపారుదల శాఖ అధికారులతో పంచుకున్న చంద్రబాబు.. వీలైనన్ని ఎక్కువ జలాలు ఉపయోగించుకునే అవకాశాలు పరిశీలించమని అధికారులకు పురమాయించారు. చంద్రబాబు కోరినట్టు వినియోగ సామర్థ్యాన్ని 500 టీఎంసీలకు పెంచాలంటే.. కొన్ని చిక్కులున్నాయి. పోలవరం సామర్థ్యం పెంచితే.. అంతర్‌ రాష్ట్ర వివాదాలు ఎదురవుతాయి. ముంపు ప్రాంతం అమాంతం పెరుగుతుంది. అప్పుడు ప్రస్తుతం ఊహిస్తున్న ముంపు మండలాలే కాకుండా .. తెలంగాణలోని కొంత భూభాగం కూడా మునుగుతుంది. అందుకు తెలంగాణ అంగీకరించదు. ఈ అంశాలనే నీటిపారుదలశాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచితే అటు శ్రీకాకుళం, ఇటు నెల్లూరు వరకు నీరివ్వడానికి అవకాశముంటుందన్నది చంద్రబాబు ఆలోచన. పొరుగు రాష్ట్రాలతో ఇబ్బందులు రాకుండానే సాధ్యమైనంత ఎక్కవ సామర్థ్యం రాబట్టాలని సీఎం చెబుతున్నారట. ఎంత మేరకు వర్క్ ఔట్ అవుతుందో మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: