ఏపీ సర్కారు రాజధాని నిర్మాణ వ్యవహారాల్లో బిజీబిజీగా ఉంది. ఇప్పటికే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థను 1200 కోట్ల రూపాయల మూలధనంతో ఏర్పాటు చేశారు. కొత్త రాజధాని నిర్మాణానికి సింగపూర్, జపాన్ ల సాయం తీసుకుంటున్నారు. తొలివిడతలో 30 వేల ఎకరాలు.. మలివిడతలో మరో 70 వేల ఎకరాలు భూమి సమీకరించాలని నిర్ణయించుకున్నారు. లక్ష ఎకరాల్లో సింగపూర్ ను తలదన్నే రాజధాని కట్టి చూపిస్తానని చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.                                                  అంతాబాగానే ఉంది కానీ.. కొత్త రాజధాని మోజులో నేతలు పాత చరిత్రను మరచిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏపీ రాష్ట్ర విభజన సందర్భంగా అభివృద్ధి అంతా హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైందని.. అది మంచి ధోరణి కాదని తెలిసొచ్చింది. మరోసారి అలాంటి తప్పు జరగకుండా అన్నిరకాల సంస్థలను, పరిశ్రమలను, పాలనాకేంద్రాలను వికేంద్రీకరించాలని శివరామకృష్ణన్ కూడా చెప్పింది. కానీ కొత్త ప్రభుత్వం తీరు చూస్తే.. రాజధానిలోనే అన్నీకేంద్రీకరించే ప్రయత్నం కనిపిస్తోంది. ఏపీకి కొత్తగా వచ్చే పరిశ్రమలను కూడా రాజధాని ప్రాంతంలోనే పెడతామని చంద్రబాబు తాజాగా ప్రకటించారు.                                 చంద్రబాబు సర్కారు ఇదే తీరు కొనసాగిస్తే.. ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అతి త్వరలోనే మొదలవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాజధాని అంటే.. అన్ని హంగులూ అక్కడే ఉండనవసరం లేదని.. పరిపాలన భవనాలు, కీలక సంస్థలు ఉంటే సరిపోతుందని శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది. చంద్రబాబు నిర్ణయాలతో ఇప్పటికే అభివృద్ధి చెందిన కోస్తా.. మరింత అభివృద్ధి చెందుతుందని.. రాయలసీమ మరింత వెనుకబడుతుందన్న ఆందోళన ఆ ప్రాంతనేతల్లో కనిపిస్తోంది. ఇది క్రమంగా పెరిగితే.. కొన్నాళ్లకు ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా తప్పదేమో..

మరింత సమాచారం తెలుసుకోండి: