అనువుగానిచోట అధికులమనరాదు.. కొంచెముండుటెల్ల కొదువగాదు.. తెలుగు సాహిత్యాన్ని ఔపాసన పట్టిన కేసీఆర్ వంటి నేతలకు ఈ వేమన పద్యం తెలియంది కాదు.. అందులోని నీతిసారం కూడా అర్థంకానిదేం కాదు.. కానీ ఎంతటి మహానుభావుడికైనా వేపకాయంత ఏదో ఉంటుందని చెబుతుంటారు. కేసీఆర్ విషయంలోనూ అంతే. విద్యాధికుడైనా.. నోటికెంతవస్తే అంత మాట్లాడటం ఆయన నైజం. అదేమంటే.. నా మాటే అంత అనే రకం. అదే ఆయన కొంప ముంచుతోంది.                                      ఎన్నికలకు ముందు మోడీ ఓ సన్నాసి అని.. దుర్బాషలాడిన కేసీఆర్ .. ఎన్నికల తర్వాత కేంద్రం... నియంతలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్రంతో ఏపీ దోస్తీ చూసిన తర్వాతైనా జాగ్రత్తపడవలసింది పోయి.. దూరం పెంచుకున్నారు. చెరువుపై అలిగితే ఏమవుతుందో.. కేసీఆర్ కు నెమ్మెదిగా తెలిసొస్తోంది. మిగులు విద్యుత్ కేటాయింపుల్లోనూ, కేంద్ర పథకాల పంపకాల్లోనూ కేంద్రంతో దోస్తీ ఉంటేనే మంచిదన్న విషయం క్రమంగా అర్థమైనట్టుంది. అందుకే నెమ్మదిగా స్టాండ్ మార్చేస్తున్నారు.                           మొన్న విద్యాసాగర్ రావును.. నిన్న దత్తాత్రేయను సన్మానించి కేంద్రానికి దగ్గరవుదామని ప్రయత్నించిన కేసీఆర్.. ఇప్పుడు పార్లమెంటు సమావేశాల్లోనూ కేంద్రానికి సహకరించాలని నిర్ణయించారు. కేంద్రంతో ఘర్షణవైఖరితో ఉండవద్దని సొంతపార్టీ ఎంపీలకు సూచించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరించాల్సిన వైఖరిపై పార్టీ ఎంపీలతో సమావేశమైన కేసీఆర్..సఖ్యతగా ఉంటూనే రాష్ట్ర కోరికలు సాధించుకుందామని చెప్పారు. ఈ స్పృహే ముందు నుంచీ ఉంటే.. తెలంగాణ రాష్ట్రానికి ఆరంభంలో విద్యుత్ కష్టాలు కాస్తయినా తగ్గేవేమో.. ఇప్పటికైనా కేసీఆర్ మనసు మార్చుకున్నందుకు తెలంగాణ ప్రజలు సంతోషించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: