తెలంగాణ శాసనసభలో టీడీపీ ఉప నేత రేవంత్ రెడ్డి గురువారం ఆసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో తన ప్రస్థానంపై ఆయన వినిపించిన కొత్త వాదనకు మీడియా మిత్రులు విస్తుపోయారు. గురువారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్, రేవంత్ పై పరోక్షంగానే అయినా కాస్త కఠువుగా వ్యవహరించారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో కూర్చున్న రేవంత్ వద్ద విలేకరులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ, మీరూ ఒకప్పుడు టీఆర్ఎస్ నేతే కదా అనగానే ఒక్కసారిగా రేవంత్ హుషారయ్యారు. తాను ఎంతమాత్రం టీఆర్ఎస్ వ్యక్తిని కాదని, తాను ముమ్మాటికీ టీడీపీ నేతనేనని వ్యాఖ్యానించారు. దీనికోసం ఆయన ఓ పిట్ట కథను వినిపించారు. హైదరాబాద్ నుంచి రైల్లో ఢిల్లీ వెళుతుండగా, నీటి కోసం లక్నోలో దిగినంత మాత్రాన ఆ నగరం మనది కాదని ఆయన అన్నారు. అలాగే ఎక్కడికి వెళ్లినా మనది హైదరాబాదేనని, ఎన్ని చోట్ల ఆగినా అంతిమంగా ఢిల్లీ చేరిన తర్వాతే రైలు దిగుతామని రేవంత్ చెప్పారు. తాను కూడా లక్నోలో ఆగిన మాదిరిగా టీఆర్ఎస్ లో కొన్నాళ్లు ఉన్నానన్నారు. అంతమాత్రాన తాను టీఆర్ఎస్ వ్యక్తిని ఎలా అవుతానంటూ ఎదురు ప్రశ్నించారు. రేవంత్ వాదనతో నోరెళ్లబెట్టిన మీడియా మిత్రులు ఆ తర్వాత చిన్నగా అక్కడి నుంచి జారుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: