ఎర్రచందనం దుంగల దొంగలను పట్టుకున్న పోలీసులు... ఈ వార్త లేకుండా పేపర్ ప్రింటుకాని పరిస్థితులు.. చంద్రబాబు వచ్చాక ఎర్ర చందనం దొంగలపై ఉక్కుపాదం మోపాం అని టీడీపీ నేతలు జబ్బలు చరుచుకుంటున్నా.. ఈ దొంగ రవాణా మాత్రం ఆగలేదు. చందనం దుంగలను అమ్ముకోవడంలో ఉన్న శ్రద్ధ.. అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చూపాలని విపక్షాలు విమర్సలు వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ఇవన్నీ పైకి చెప్పడానికి బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి.                                  ఎర్ర చందనం దొంగలకు గ్రామస్థాయిలో అన్నిపార్టీల నాయకుల అండదండలున్నట్టు తెలుస్తోంది. ఐతే ప్రత్యేకించి.. వైకాపాకు ఈ ఎర్ర చందనం స్మగ్లర్లతో ఎక్కువ లింకులున్నాయని టీడీపీ గోల పెడుతోంది. అందుకు ఉదాహరణగా చంద్రబాబుపై హత్యాయత్నం చేసిన గంగిరెడ్డి వంటి వారిని చూపిస్తోంది. వైకాపా కూడా ఈ ఆరోపణలను తిప్పి కొడుతోంది. కావాలనే తమ పార్టీ నేతలకు స్మగ్లర్లకు లింకులుయ్యాని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శిస్తోంది. నేరుగా ఎదుర్కొలేక.. తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడుతోంది.                                     ఈ నేపథ్యంలో ఓ వైకాపా ఎంపీ... ఎర్రచందనం కేసు నిందితుడిని కలవడం కలకలం సృష్టిస్తోంది. ఎర్రచందనం కేసులో పట్టుబడి తిరుపతి సబ్ జైలులో ఉన్న ఓ ఖైదీని రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి శుక్రవారం కలిశారు. రాజంపేటకు చెందిన వై.ఆర్.ఎం. రెడ్డి చందనం కేసులో పది రోజుల క్రితం పోలీసులకు దొరికిపోయాడు. ఇప్పటికే వైకాపా నేతలపై చందనం స్మగ్లర్లన్న ముద్రవేస్తుంటే.. సాక్షాత్తూ ఓ ఎంపీ జైలుకెళ్లి ఓ ఖైదీని కలిస్తే.. జనంలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయి.. ఇలాంటి విషయాల్లో పార్టీ అధ్యక్షుడు జగన్.. ఎంపీలు, ఎమ్మెల్యేలకు మార్దదర్శకాలు రూపొందిస్తే బెటరేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: