హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న ప్రతిపాదనను తెలంగాణలోని అన్ని పార్టీలూ వ్యతిరేకిస్తున్నాయి. టీఆర్ఎస్, కాంగ్రెస్ , వైఎస్సార్ కాంగ్రెస్ తదితర పార్టీలు ఎన్టీఆర్ పేరు శంషాబాద్ టెర్మినల్ కు పెట్టడం పట్ల నిరసన తెలుపుతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం ఈవిషయంలో పోరాడుతోంది. తెలంగాణ తెలుగుదేశం లీడర్లు ఎన్టీఆర్ పేరును దేశీయ టెర్మినల్ కు పెట్టాలన్న కేంద్ర నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. ఈ విషయంలో రెండో ఆలోచన ఉండకూడదని అంటున్నారు. అయితే ఇక్కడే తెలుగుదేశానికి ఒక ఇరకాటం ఉంది. ఎన్టీఆర్ అంటే తమకూ గౌరవం ఉందని.. అయితే ఆయన పేరును ఆంధ్రప్రదేశ్ లోని ఎయిర్ పోర్టులకు పెట్టుకోవాలని మిగిలిన పక్షాల వారు అంటున్నారు. ఎలాగూ ఏపీలో డజనుకు పైగా కొత్త విమానాశ్రయాలను కడతామని చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. వాటిల్లో ఒకటి కాకపోతే అన్నింటికీ ఎన్టీఆర్ పేరును పెట్టుకోండి.. హైదరాబాద్ లోని టెర్మినల్ ను మాత్రం వదిలేయండి.. దానికి తెలంగాణ ప్రాంత నేత పేరు పెట్టండి.. అంటూ టీఆర్ఎస్ , కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. ఊరికే ఎన్టీఆర్ పేరును వ్యతిరకించడం లేదు.. ఏపీలో కొత్త విమానాశ్రయాలను కడతామంటున్నారు కదా.. వాటికి ఆయన పేరును పెట్టుకోండి.. ఇక తెలంగాణ పరిధిలోని విమానాశ్రయంలో ఆయన ప్రస్తావన వద్దు.. అని తెలుగుదేశం వైరి పక్షాలు అంటున్నాయి. మరి ఏపీలో కొత్త విమానాశ్రాయాలను కడతామని అనడమే తెలుగుదేశం అధినేత పొరపాటు అయ్యింది. అవి ఎప్పటికి పూర్తవుతాయో.. కనీసం ఎప్పుడు నిర్మాణం ప్రారంభమవుతుందో కూడా తెలియదు. అయితే వాటిని అడ్డం పెట్టుకొని హైదరాబాద్ లోని టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరును పెట్టడాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ విధంగా తెలుగుదేశం ఇరకాటంలో పడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: