హిందూత్వ ప్రబోధకులు గొప్పగా చెప్పుకునే సనాతన స్వర్ణ యుగంలో మునులు, సాధువులు, బాబాలు, గురువులు ఏం చేసేవారు? ముక్కు మూసుకుని ఒంటికాలి తపస్సు చేసేవారు. హిమాలయాలకు చేరి పవిత్ర గంగా తీరాన లేదా మరో నది తీరాన కమండల ధారియై తపమాచరించెడివారు. సర్వసంగపరిత్యాగియై హరహర శంభో అంటూ దివ్యజ్ఞానార్ద్ధులై కఠోర బ్రహ్మచర్యం పాటించేవారు. శిష్యులను వెంటేసుకుని ధర్మ ప్రబోధం కావించేవారు. మనం చూడకపోయినా మన పుస్తకాలు, కధలు, బోధనలు ఈ సంగతి చెబుతాయి. మరి ఇప్పుడో! ఏ.సి కారులు లేకుండా గురువులు బైటికి అడుగు పెట్టరు. కనికట్టు విద్యలు ప్రదర్శిస్తూ తమను తాము దేవుళ్లుగా చెప్పేసుకుంటూ కోట్లు ఆర్జించేందుకు బాబా అవతారం ఓ దగ్గరి మార్గం. మందీ మార్బలం, వందలాది ఎకరాల భూ ఆక్రమణలు, శిష్యగణం అనబడే గూండాలు, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన భారీ భవన సముదాయాలు లేనిదే వారి సర్వసంగపరిత్యాగం పూర్తి కావడం లేదు. భక్త కోటిని సంపాదించి తద్వారా రాజకీయ పలుకుబడి సాధించి తద్వారా చట్టాల భయం లేకుండా చూసుకోనిదే నడవని ఆశ్రమం లేదు. ఆశ్రమాలలో జరిగే చట్ట విరుద్ధ కార్యకలాపాలు వెల్లడి కాకుండా ఉండేదుకు గూండాలను పోషించడం ఆశ్రమాల నిర్వాహకులకు, బాబాలకు మామూలే. కానీ సంత్ బాబా రామ్ పాల్ ఈ విషయంలో అందరిని మించిపోయి ఏకంగా “బాబా కమేండో” లు అంటూ చిన్న సైజు సాయుధ సైన్యాన్ని పోషించి సరికొత్త సంప్రదాయానికి తెర తీశారు. ఈ సాయుధ గుంపులకు మాజీ పోలీసులు, మాజీ సైనికాధికారులు కమెండో శిక్షణ ఇవ్వడం మరో విపరీతం. బాబాను అరెస్టు చేసేందుకు వెళ్తే ఈ కమెండోల సాయుధ ప్రతిఘటన వల్ల అనేకమంది పోలీసులు బులెట్ గాయాల పాలు కావడం ఇంకా విపరీతం.  అసలిన్నాళ్లూ ప్రభుత్వాలు ఎలా ఊరుకున్నాయి? బాబా కమెండోలు రహస్యంగా ఏమీ దాక్కోలేదు. కోట గోడలా భారీ ఎత్తున నిర్మించిన ప్రహరీ బురుజులపైనే నిలబడి వారు తమ ఆయుధాలు ప్రదర్శించారు. సాయుధ పహారా కాస్తూ బహిరంగంగానే ఆశ్రమం చుట్టూ కలియ తిరిగేవారు. అయినా ప్రభుత్వాలు, చట్టాలు చూస్తూ ఎలా ఊరుకున్నాయి? సాయుధ నక్సలైట్లకు అన్నం పెడుతున్నారని మారు మూల అడవుల్లో గుంపులు గుంపులుగా కూంబింగ్ చేస్తూ అహో రాత్రాలు నివాసాలకు దూరంగా గడిపేస్తూ గిరిజనాల దుంప తెంచే ప్రభుత్వాలు, చట్టాలు నగరం లోనే తమ మధ్యనే సాయుధ మూకల పహారాలో ఉన్న హంతక బాబాను ఎలా సహించారు?

మరింత సమాచారం తెలుసుకోండి: