శంషాబాద్ ఎయిర్ పోర్టులో దేశీయ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం టీడీపీ, టీఆర్ఎస్ లమధ్య మరో పోరాటానికి కారణం అవుతోంది. ఇప్పటికే ఉప్సూనిప్పుల్లా ఉన్న ఈ రెండు పక్షాల మధ్య తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం మరింత మంటపెడుతోంది. ఈ సందర్భంగా ఇరుపక్షాల నేతలు పేలుస్తున్న మాటల తూటాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇరుపక్షాలూ చాలా బలమైన పాయింట్లను లేవనెత్తుతండటం విశేషం. కేసీఆర్ కు ఎన్టీఆరే రాజకీయ భిక్ష పెట్టాడని టీడీపీ నేతలు అంటున్నారు. కేసీఆర్ రాజకీయంగా ఎదగడానికి ఎన్టీఆరే కారణమని..అలాంటి ఎన్టీఆర్ విషయంలో ఇప్పుడు కేసీఆర్ ఈ విధంగా వ్యవహరించడం విడ్డూరమని టీడీపీ నేతలు ధ్వజమెత్తుతున్నారు. మరి ఇది వ్యాలీడ్ పాయింటే! అందులోనూ కేసీఆర్ తన తనయుడికి ఎన్టీఆర్ పేరే పెట్టుకొన్నాడు. ఈ విషయాన్ని కూడా టీడీపీ వాళ్లు హైలెట్ చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతల మాటలపై తెలంగాణ రాష్ట్ర సమితి వైపు నుంచి గట్టి స్పందనే వస్తోంది! ఎన్టీఆర్ పై చెప్పులేయించినది చంద్రబాబు కాదా?! అని తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్లు అంటున్నారు. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి, ఆయనను పదవి నుంచి తప్పించి.. అవమానించి చంద్రబాబు కాదా?! అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇప్పించలేదు కదా! కనీసం ఎన్టీఆర్ పేరు, ఫోటో ల ప్రస్తావన కూడా లేకుండా చేసింది చంద్రబాబు కాదా?! అని టీఆర్ఎస్ వాళ్లు అంటున్నారు! ఈ విధంగా ఇరు పార్టీల నేతలూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు. కేసీఆర్ తెలుగుదేశంలో, ఎన్టీఆర్ బొమ్మద్వారా ఎదిగినది ఎంత నిజమో... చంద్రబాబు ఎన్టీఆర్ ను అవమానించింది కూడా అంతే నిజం! మరి ఇప్పుడు ఇలా దుమ్మెత్తిపోసుకొంటున్న వీరిలో.. ఎవరి మాట నెగ్గాలి. ఎవరి అభిప్రాయం మేరకు ఎయిర్ పోర్టుకు పేరు పెట్టాలి?!

మరింత సమాచారం తెలుసుకోండి: