ఏపిలో రైతు రుణమాఫీ ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కోసం బడ్జెట్‌లో ఐదు వేల కోట్లు కేటాయించి రైతు సాధికారిత సంస్థకు బదలాయించింది. వచ్చే నెల 8 లేదా ఆలోపల రుణ మాఫీకి సంబంధించి 20 శాతం నిధులు రైతు ఖాతాలకు బదలాయిస్తామని ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత రుణమాఫీ ప్రక్రియ మొదలవుతుందని ప్రభుత్వం చెబుతున్నా, ఆచరణలో ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మంత్రులకు రుణమాఫీ ప్రక్రియ వీలైనంత త్వరితగతిన మొదలు పెట్టాలనే తాపత్రయం ఉన్నా, రుణమాఫీకి అర్హత ఉన్న రైతుకే లబ్ధి చేకూర్చాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉంది. కానీ ఈ అర్హత ఉన్న రైతును గుర్తించే ప్రక్రియ జటిలమవుతోంది. రైతుల ఖాతాలు 1.18 కోట్లు ఉండగా, వీటి రుణ మాఫీకి 84 వేల కోట్ల రూపాయలు అవసరం. బ్యాంకర్లు వివరాలు సేకరించి ప్రభుత్వానికి 80 లక్షల ఖాతాలకు 60 వేల కోట్ల మేరకు రుణాలు మాఫీ చేయాల్సి ఉంటుందని నివేదికను ప్రభుత్వానికి అందించాయి. అనేక నిబంధనలు, ఆధార్ తప్పనిసరి చేయడం, రేషన్ కార్డు కావాలనడం వల్ల చివరకు ఖాతాలు 60 లక్షలకు ప్రభుత్వం తగ్గించింది. కానీ మాఫీ సొమ్ముపై సందిగ్ధత నెలకొంది. ఒక అంచనా ప్రకారం 37 వేల కోట్ల రూపాయల వరకు రుణాల మాఫీ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ఖాతాల సంఖ్యను 35 లక్షలకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోంది. దీనికి అనేక రైడర్స్‌ను పెట్టారు. బహుళ ఖాతాలు ఉండటం, కుటుంబానికి ఒకరే అర్హులు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనే నిబంధనల వల్ల ఖాతాల సంఖ్యను 35 లక్షలకు తగ్గించే అవకాశం ఉంది. ఇదే జరిగితే రుణ మాఫీ మొత్తం 25 వేల కోట్లకు తగ్గుతుందంటున్నారు. 25 వేల కోట్ల రూపాయలకు రుణమాఫీని వర్తింప చేసే విధంగా ఖాతాల సంఖ్యను తగ్గిస్తే సాలీనా ఐదు వేల కోట్ల రూపాయల చొప్పున ఐదేళ్లలో 25వేల కోట్ల రూపాయలు మాఫీ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కానీ బ్యాంకర్లు ఇచ్చిన 87 వేల కోట్ల రూపాయల రుణమాఫీపై 20 శాతం తొలి విడతగా రైతుల ఖాతాలకు సొమ్ము ముట్టాలంటే కనీసం 17,400 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి. కానీ ఆలస్యం కావడం వల్ల అపరాధ వడ్డీ చెల్లింపునకు 12,180 కోట్ల రూపాయలవుతుంది. ఏడాదిన్నర నుంచి రైతులు వడ్డీలు చెల్లించడం లేదు. దీనివల్ల వడ్డీ అదనంగా 6 వేల కోట్ల రూపాయలవుతుంది. కానీ రకరకాల నిబంధనల వల్ల రైతుల ఖాతాలను 35 లక్షలకు తగ్గించి, రుణమాఫీని 25 వేల కోట్ల రూపాయలకు కుదించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఇటీవల జన్మభూమి సందర్భంగా ఆధార్ లింక్ ఉన్న రైతు ఖాతాల వివరాలను జన్మభూమి కమిటీలకు అప్పగించారు. శాంపిల్‌గా 28 లక్షల ఖాతాల వివరాలను అప్పగిస్తే 8 లక్షల మంది రైతులకే ఆధార్ అనుసంధానం ఉందని తేలింది. దీంతో 80 లక్షల ఖాతాల సంఖ్య 60 లక్షల ఖాతాలకు తగ్గింది. మొత్తం 25వేల రూపాయలు ఆలోపు రుణం ఉన్న వల్ల రైతులు ఎనిమిది లక్షల మంది దాకా ఉన్నారని, వీరి రుణాలను ఎకాఎకిన మాఫీ చేసేందుకు రెండు వేల కోట్ల రూపాయలు సరిపోతాయని బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో తొలి విడతగా 25 వేల రూపాయలు వరకు ఉన్న రుణాలను మాఫీ చేసి, మిగిలిన సొమ్మును 50 వేల రూపాయల నుంచి 1.50 లక్షల రూపాయల వరకు రుణం ఉన్న రైతులను ఎంపిక చేసి 20 శాతం సొమ్మును వారి ఖాతాలకు బదలాయించే అవకాశం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: