గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటికి దిగనున్నాయి. గడచిన ఎన్నికల్లో కుదిరిన పొత్తును గ్రేటర్ ఎన్నికల్లోనూ కొనసాగించేందుకు రెండు పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి రఘునందన్ రెండు పార్టీల పొత్తును ధ్రువీకరించారు. "కొన్ని విషయాల్లో విభేదాలున్నప్పటికీ, ప్రస్తుతానికి రెండు పార్టీలు వాటిని పక్కనబెట్టాయి. గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడిగానే బరిలో దిగేందుకు నిర్ణయించాయి. అంతేకాక ఫిబ్రవరిలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థులకు మద్దతు తెలపనుంది" అని రఘునందన్ చెప్పారు. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తన పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగాలన్న అంశంపై ఇరువర్గాలు ఓ అవగాహనకు వచ్చాయి. గ్రేటర్ ఎన్నికలను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వస్తున్న టీఆర్ఎస్, మరింత మంది టీడీపీ నేతలను ఆకట్టుకునే యత్నాలను కొనసాగిస్తోంది. గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న నమ్మకం కలిగిన తర్వాతే ఎన్నికలకు తెరలేపాలన్న టీఆర్ఎస్ వ్యూహానికి తాజాగా బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ గట్టిగానే షాక్ ఇచ్చిందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: