ఆర్.కృష్ణయ్య తెలంగాణ ప్రాంత తెలుగుదేశం శాసన సభ్యుడే కానీ.. పార్టీ తో కొంత వరకూ అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటారు. శాసన సభలో మిగతా తెలుగుదేశం పార్టీ సభ్యులు కలియబడినంత స్థాయిలోకృష్ణయ్య తెరాస ప్రభుత్వంపై రెచ్చిపోడు. అలాగే ఉద్యమాల సమయంలో కూడా ఆయన పార్టీ కన్నా, బీసీల నాయకుడి పదవికే ప్రాధాన్యం ఇస్తున్నాడు. ఇటువంటి నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న వ్యూహం.. దానికి తెరాస మొదలుపెట్టిన ప్రతి వ్యూహం కలిసి.. కృష్ణయ్యను ఇబ్బంది పెడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే... తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారిపై తెలుగుదేశం పై పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో తెరాసా వాళ్లు ముధుసూధనాచారి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి.. అనే విషయాన్ని హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కొత్త రాష్ట్రంలో ఒక బీసీకి స్పీకర్ బాధ్యతలు అప్పజెప్పి కేసీఆర్ గొప్పపనిచేస్తే... తెలుగుదేశం పార్టీ బీసీని పదవి నుంచి తొలగించాలని చూస్తోందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఈ విధమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్న తెరాస ఈ వ్యవహారంలోకి కృష్ణయ్యను కూడా లాక్కొస్తోంది. తెదేపా శాసన సభ్యుడు అయిన కృష్ణయ్య ఒక బీసీ స్పీకర్ పై అవిశ్వాస తీర్మానాన్ని సమర్థిస్తాడా?! దానికి మద్దతునిస్తాడా?! అని టీఆర్ఎస్ వాళ్లు ప్రశ్నిస్తున్నారు. మరి చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం అని పోరాడే కృష్ణయ్య ఇప్పుడు ఎలా వ్యవహరిస్తాడో!..

మరింత సమాచారం తెలుసుకోండి: