ఆంధ్రప్రదేశ్ విభజనతో ప్రాంతాలు, మనుషులు, మనసులు, సంస్థలు రెండుగా విడిపోయాయి. ఈ విభజన అంతటితో ఆగలేదు. చివరకు దేవుళ్లని కూడా ఆంధ్రాదేవుడు తెలంగాణ దేవుడు అని పిలుచుకునే పరిస్థితి వచ్చింది. ఎందులో ఎలా ఉన్నా.. దేవుళ్ల విషయానికి వస్తే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రాదే పైచేయని చెప్పక తప్పదు. కలియుగ వైకుంఠంగా పేరుపొందిన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు శ్రీశైలం మల్లన్న, సింహాద్రి అప్పన్న, శ్రీకాళహస్తి, కాణిపాకం, బెజవాడ దుర్గమ్మ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దైవక్షేత్రాలు.. అలాగని తెలంగాణలో దేవుళ్లకు తక్కువేమీ లేకున్నా.. పోలిస్తే మాత్రం ఈ విషయంలో ఆంధ్రాదే పైచేయి. ఆ లోటు పూడ్చేందుకే కేసీఆర్.. ఆ మధ్యన యాదగిరిగుట్టను వాటికన్ సిటీలా తీర్చిదిద్దుతామన్నారు. విభజన సమయంలో గట్టిగా పోరాడకపోతే.. భద్రాచల రామయ్య కూడా ఆంధ్రావైపునకు వెళ్లేవాడే. దేవుళ్ల విషయం సంగతి అలా ఉంచితే.. తిరుపతి వెంకన్న నిధుల్లో వాటా కావాలంటూ కొందరు తెలంగాణవాదులు వాదన వినిపిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి తెలంగాణకు దాదాపు వెయ్యికోట్ల రూపాయల నిధులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ తెలంగాణ దేవాలయాల పరిరక్షణ సంఘం సభ్యులు సోమవారం తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మంత్రులు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లను కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రం విడిపోయాక ఇక తిరుపతి వెంకన్న నిధులు తెలంగాణకు ఎందుకు వస్తాయనేగా మీ సందేహం. అసలు విషయం ఏమిటంటే.. రాష్ట్రం విడిపోక ముందు ఉన్న ఒక చట్టం ప్రకారం.. పెద్ద దేవాలయాలు.. చిన్న గుళ్ల అభివృద్ది కోసం ఏటా కొంత సొమ్ము ఇవ్వాల్సి ఉంది. ఐతే కొన్నేళ్లుగా టిటిడి ఈ సొమ్ములు చెల్లించడం లేదట. టీటిడి.. ఇలా బకాయి పడ్డ సొమ్ము దాదాపు 2వేల కోట్ల పైమాటేనంట. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి బకాయి కాబట్టి.. ఆ సొమ్ముపై తమకూ హక్కు ఉంటుందంటున్నారీ తెలంగాణవాదులు.. విభజన చట్టం ప్రకారం 42శాతం వాటా ప్రకారం తెలంగాణదేవాదాయ శాఖకు టీటీడీ వెయ్యి కోట్ల రూపాయలు వస్తాయట. ఆ సొమ్ము రప్పించేందుకు కృషి చేయమని వారు కోరుతున్నారు. వీరికి నాయకత్వం వహిస్తున్నది చిలుకూరు బాలాజీ ఆలయపూజారి సౌందరరాజన్ కావడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: