చేసినా చేయకపోయినా... ఏపీ ముఖ్యమంత్రి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఓపక్క మోడీ అండతో కేంద్రం నుంచి పనులు చేయించుకుంటూ సత్తా చాటుతున్నారు. నిరంతర విద్యుత్ వంటి తాయిలాలు సాధించుకుని సొంత రాష్ట్రానికి మేలు చేసుకుంటున్నారు. విభజన పుణ్యంతో వచ్చిన రాజధాని నిర్మించే అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకుంటున్నారు. సింగపూర్, జపాన్ అంటూ పెట్టుబడుల కోసం జగమంతా కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు.              చంద్రబాబు జోరు చూసిన కేసీఆర్ కూడా ఇక లాభం లేదని.. జోరు పెంచినట్టున్నారు. ఏపీ రాజధాని కబుర్లకు చెక్ పెడుతున్నట్టు.. హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకాశహర్మ్యాలు అంటూ ప్లాన్లు గీస్తున్నారు. చంద్రబాబు వారం రోజుల్లో పరిశ్రమలకు అనుమతులిస్తామని చెబుతుంటే.. కేసీఆర్ ఏకంగా పారిశ్రామిక విధానం బిల్లునే తెచ్చేశారు. పారిశ్రామిక అనుమతుల నిమిత్తం.. జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో కమిటీలు, నోడల్ ఏజెన్సీల ఏర్పాటు చేస్తున్నట్టు బిల్లులో చెప్పారు.                     నిర్ణీత కాలపరిమితి మేరకు అనుమతుల మంజూరు, జాప్యం చేస్తే జరిమానాలు వంటి వినూత్న అంశాలతో కూడిన అత్యత్తమ ఏకగవాక్షవిధానాన్ని బిల్లులో పొందుపరిచింది. ఈ బిల్లు ప్రకారం రాష్ట్ర, జిల్లా స్థాయి టీపాస్‌ఐపాస్‌ కమిటీలను ఏర్పాటుచేస్తారు. రాష్ట్ర కమిటీకి పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా, పరిశ్రమల శాఖ కమిషనర్‌ కన్వీనర్‌గా, సంబంధిత శాఖాధిపతులు సభ్యులుగా ఉంటారు. జిల్లా కమిటీకి కలెక్టర్‌ ఛైర్మన్‌గా, సంయుక్త కలెక్టర్‌ వైస్‌ఛైర్మన్‌గా సంబంధిత శాఖలు జిల్లా, ప్రాంతీయ స్థాయి అధికారులుంటారు. పరిశ్రమలను స్థాపించే సంస్థలు నోడల్‌ ఏజెన్సీలకు దరఖాస్తులను సమర్పించాలి.               దరఖాస్తును స్వీకరించిన వెంటనే నోడల్‌ ఏజెన్సీ రశీదు ఇస్తుంది. అందులో దరఖాస్తు తేదీ, తుది అనుమతుల మంజూరు తేదీని ముందే వెల్లడిస్తారు. నోడల్ ఏజెన్సీలే ఆయా రంగాలకు చెందిన నిపుణులు, విశ్రాంత అధికారులను సమావేశానికి పిలిచి, చర్చించి, తుది అనుమతులు మంజూరుచేస్తాయి. భారీపరిశ్రములకు 15 రోజుల్లోనే అనుమతులిస్తారట. నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయకపోతే బాధ్యులైన అధికారులను గుర్తించి, జరిమానాలతో పాటు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఇలా చంద్రులిద్దరూ పోటీపడి ప్రగతిబాటపడితే బాగుపడేది తెలుగు ప్రజలే.

మరింత సమాచారం తెలుసుకోండి: