తెలంగాణ..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు పెట్టుబడుల సాధనకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను ఆకర్షించేందుకు వీలుగా నూతన విధానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. పారిశ్రామిక విధానాలకు ముఖ్యమంత్రి కెసీఆర్ తుది రూపు ఇవ్వగా..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెట్టుబడుల సాధన కోసం విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ పర్యటించి వచ్చిన ఆయన తాజాగా జపాన్ పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన ప్యానసోనిక్ తోపాటు ఎన్మార్ తదితర కంపెనీల ప్రతినిధులతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. పెట్టుబడుల సాధనకు సంబంధించి రాబోయే రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కన్పిస్తోంది. రాష్ట్రంలో యూనిట్లు పెట్టే వారికి ఎలాంటి జాప్యం చేయకుండా అనుమతులు మంజూరు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఐఐపాస్,2014 చట్టాన్ని శాసనసభలో ప్రవేశపెట్టింది.  ఇది అమల్లోకి వచ్చిన వెంటనే మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో..మధ్యతరహా పరిశ్రమలకు 30 రోజుల్లో అన్ని అనుమతులు రాబోతున్నాయి. ఈ గడువులోగా ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయకపోతే పారిశ్రామికవేత్తలకు ఆటోమేటిక్ గా అనుమతులు లభించినట్లేనని నూతన చట్టంలో పేర్కొన్నారు. నూతన చట్టం తేవటంతోపాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల చుట్టుపక్కల తెలంగాణ ప్రభుత్వం లక్షలాది ఎకరాల పారిశ్రామిక భూములను సిద్ధంగా ఉంచింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు కల్పించే రాయితీలు..ప్రోత్సాహకాలపై ప్రభుత్వం ఇంకా ప్రకటన చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా నూతన విధానానికి సంబంధించి ప్రాధమిక కసరత్తు కూడా ప్రారంభించలేదు. చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల ద్వారానే పెట్టుబడుల సాధన కోసం ప్రయత్నిస్తున్నారు. పారిశ్రామిక లాబీయింగ్ విషయంలో ఆరితేరిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా ప్రాజెక్టును సాధించటం ద్వారా ఓ అడుగు ముందుకు వేశారు. అయితే కంపెనీ కోరిన అన్ని రాయితీలు..ప్రోత్సాహకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుత వాతావరణం చూస్తుంటే తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులు..ప్రతిష్టాత్మక కంపెనీలను ఆకర్షించే పనిని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం కన్పిస్తోంది. అయితే ఇందులో ఎవరు విజేతగా నిలుస్తారనేది కొద్ది కాలం పొయిన తర్వాత కానీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి: