కేంద్ర విమానయానశాఖ నిర్ణయం పుణ్యమా అని తెలుగు నేతల నోళ్లలో ఎన్టీఆర్ పేరు మరోసారి మారుమోగుతోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టు దేశీయటెర్మినల్ కు ఇప్పుడు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై ఆంధ్రా నేతలు, తెలంగాణ నేతలు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. ప్రాంతాలవారీగా.. పార్టీల వారీగా మాటల యుద్ధం చేస్తున్నారు. కేంద్రంతో ఉన్న దోస్తీతోనే ఆంధ్రా సీఎం తెలంగాణపై పెత్తనం చెలాయిస్తున్నారని టీడీపీ మినహా మిగిలిన తెలంగాణ నేతలంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ ఇష్యూ ఇప్పుడు ఏకంగా పార్లమెంటులోనూ చర్చనీయాంశమైంది.                                  ఎన్టీఆర్ ప్రతిష్ట పెంచేందుకు చంద్రబాబు ఈ పని చేశారని తెలంగాణ నేతలు వాదిస్తుంటే... ఓ తెలంగాణ మాత్రం వింత వాదన వినిపిస్తున్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ పరువు తీయడం కోసమే.. శంషాబాద్ దేశీయ టెర్మినల్ కు పట్టుబట్టి ఎన్టీఆర్ పేరు పెట్టించారని వాదిస్తున్నారు. ఎందుకంటే.. విమానాశ్రయం మొత్తానికి రాజీవ్ గాంధీ పేరు ఉంటే.. అందులో ఓ భాగమైన దేశీయ టెర్మినల్ కు మాత్రమే ఎన్టీఆర్ పేరు పెట్టడం పెద్దాయనను అవమానించడమే అంటున్నారు. ఎవరీ నేత అనుకుంటున్నారా.. ఆయనే టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్.                  అంతేకాదు... ఎన్టీఆర్ పరువుకు ప్రతిష్టకు భంగం కలిగించే బాబు చర్యల పట్ల ఆయన కుటుంబ సభ్యులు జాగ్రత్తపడాలంటున్నారు. విచిత్రంగా అనిపిస్తున్నా.. వినోద్ మాటల్లోనూ కాస్త లాజిక్కుంది.. ఎలాగూ ఆంధ్రాలో 3, 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు కడతామని బాబు చెబుతూనే ఉన్నారు. మరి వాటిలో దేనికైనా ఎన్టీఆర్ పేరు పెడితే ఘనంగా ఉంటుంది కదా.. అంతేకాదు.. అసలు ఏపీ కొత్త రాజధానికే ఎన్టీఆర్ పెడతామని కూడా టీడీపీ నేతలు చెబుతున్నారు. మరి ఆ స్థాయి నేత పేరును దేశీయ టెర్మినల్ కు పెట్టించడం.. అందులోనూ విభజన జరిగాక తెలంగాణలోని ఓ ఎయిర్ పోర్టుకు పెట్టించడం అంత అవసరమా అని వాదించేవారూ ఉన్నారు. ఏదేమైనా వినోద్ కుమార్ కు ఎన్టీఆర్ పట్ల అంత ప్రేమ ఎందుకు కలిగిందో.. అర్థంచేసుకోలేని వారెవరు చెప్పండి..

మరింత సమాచారం తెలుసుకోండి: