విభజన.. ఈ పదం వినగానే.. రాష్ట్ర విభజనే గుర్తుకు వస్తుంది. రెండు మూడేళ్లుగా అంతగా ప్రాచుర్యం పొందిన పదం కదా.. రాష్ట్ర విభజన అంశం రెండు తెలుగు రాష్ట్రాలను కొన్నాళ్లుగా కుదిపేసింది. దీనికి అనుకూలంగా మాట్లాడేవాళ్లూ, వ్యతిరేకించేవాళ్లూ.. వారి వారి వాదనలను అన్ని వేదికలపై వినిపించారు. ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల్లోనూ ఎక్కడ చూసినా విభజన చర్చలే. ఐతే ఇప్పుడు మీరు చదువుతున్న వార్త మాత్రం రాష్ట్ర విభజన గురించి కాదు.                             ఇది ఆర్టీసీ బస్సులో విభజన గురించిన సంగతి. ఔను. ఆర్టీసీ బస్సులో.. అదీ హైదరాబాద్ పరిసరాల్లోని సిటీ బస్సులో ప్రయాణమంటే మహిళలకు నరకం కనిపిస్తుంటుంది. ఇక రద్దీ వేళల్లో వాళ్ల పాట్లు అన్నీ ఇన్నీ కావు.. ఆడవారికి ప్రత్యేకమంటూ కొన్ని సీట్లు కేటాయించినా.. వాటిని ఆక్రమించే పురుషపుంగవులెందరో.. దబాయించి అడిగితే సీటు ఖాళీ చేసినా.. రద్దీ పేరుతో మీద మీద పడేవారికి కొదువే లేదు. ఆ రద్దీలో ఎక్కడం.. దిగడం.. అబ్బో నగర మధ్యతరగతి మహిళకు ఎన్ని కష్టాలో. ఇక ఆ బస్సులో కండక్టర్ కూడా మహిళైతే.. ఆమె కష్టాలు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.                                          ఇప్పుడు ఈ కష్టాలకు ఫుట్ స్టాప్ పడబోతోంది. ఇప్పటికే కొన్ని బస్సుల్లో పడింది కూడా. లేడీస్ రిజర్వేషన్ సీట్లకు, మిగిలిన సీట్లకూ మధ్య స్లైడింగ్ డోర్ ఏర్పాటు చేస్తున్నారు. మగాళ్లకు ఆ డోర్ దాటి వెళ్లడం నిషిద్ధం. తలుపు ఉంటుంది కాబట్టి వెళ్లే సాహసం కూడా చేయరు. రద్దీ పేరుతో ముందు నుంచి ఎక్కడం కూడా కుదరదు. ఇక రద్దీ పేరుతో ఆడవాళ్లను ఎక్కడపడితే అక్కడ తాకే రోగ్ ల ఆటకట్టయినట్టే.. ఇప్పటికే 80 బస్సుల వరకూ ప్రయోగాత్మకంగా ఈ డోర్లు అమర్చారు. ఆ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలు మాత్రం చాలా ఖుషీగా ఉన్నారు. ఈ విభజన తమకెంతో సౌకర్యంగా ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: