తెలుగు ప్రాంతంలో నక్సలిజం పుట్టింది ఉత్తరాంధ్రలోనైనా.. అన్నలంటూ వారిని అక్కున చేర్చుకుంది తెలంగాణ ప్రాంతీయులే. ఈ ప్రాంతానికి చెందిన వారెందరో తుపాకీ చేతబట్టి.. అన్నల్లో కలసిపోయారు. అంతే కాదు.. మావోయిస్టు నేతలుగా ఎదిగారు. ఇప్పుడు అనేక నక్సల్ గ్రూపులకు నాయకత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గణపతి తెలంగాణకు చెందినవారే.                                        ఎన్నికలకు ముందు కేసీఆర్ కూడా నక్సలైట్ల ఎజెండానే తమ ఎజెండా అన్నారు. నక్సలైట్లు దేశభక్తులను ఎన్నోసభల్లో చెప్పారు. కానీ అధికారంలోకి రాగానే కేసీఆర్ స్వరం, విధానం మారిపోయాయని మావోయిస్టులు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను నిర్బంధంలో ఉంచుతోందని లేఖలో పేర్కొన్నారు.                                       తెలంగాణలో విద్యుత్ సమస్యతో ఇప్పటికే 400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. గణపతి విమర్శించారు. ఆ రైతుల కుటుంబాలకు పది లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులకు విత్తనాలు, పురుగు మందులు ప్రభుత్వమే ఉచితంగా అందించాలన్నారు. అంతేకాదు.. కేసీఆర్ ప్రజలతో పాటు మీడియాను అణగదొక్కుతున్నారని విమర్శించారు. టీవీ ఛానళ్ల ప్రసారాలు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. మరి ఈ లేఖపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో..?

మరింత సమాచారం తెలుసుకోండి: