నరేంద్రమోడీ ప్రభుత్వం ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంపై రాజ్యసభలో విమర్శలు వెల్లువెత్తాయి. ఆస్ట్రేలియాలో అదానీ గ్రూప్‌ కోల్‌ ప్రాజెక్టుకు ఎస్‌బీఐ 100 కోట్ల డాలర్లు మంజూరు చేయడాన్ని ప్రతిపక్షాలు ఆక్షేపించాయి. ఇది ఆశ్రిత పక్షపాతం కాక మరేమిటని తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు డెరెక్‌ ఒబ్రెయిన్‌ ప్రశ్నించారు. జీరో అవర్‌లో ఈ అంశాన్ని ఒబ్రెయిన్‌ లేవనెత్తారు. అదానీ ప్రాజెక్టుకు రుణం ఇవ్వడానికి ఐదు అంత ర్జాతీయ బ్యాంకులు నిరాకరించినప్పటికీ కార్పొరేట్‌ సంస్థకు పెద్దమొత్తంలో రుణం ఇవ్వడానికి ఎస్‌బీఐ అంగీకరించిందని విమర్శించారు. ఐదు ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకులు-సిటీ బ్యాంక్‌, డచ్‌ బ్యాంక్‌, రాయల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ స్కాట్లాండ్‌, హెచ్‌ఎస్‌ బీసీ, బార్క్లేస్‌- ఆస్ట్రేలియాలో బొగ్గు మైనింగ్‌కు నిరాకరిస్తూ రుణాలు ఇవ్వలేదని తెలిపారు. అంత ర్జాతీయ బ్యాంకులే నిరాకరిస్తే అదానీకి రుణం ఇవ్వడానికి ఎస్‌బీఐపై పనిచేసిన అదృశ్య శక్తులు ఏమిటని నిలదీశారు. రెండు, మూడేళ్లలో భారత్‌కు బొగ్గు దిగుమతులు నిలిచిపోతాయని బొగ్గుశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నారని, అదానీ ఆస్ట్రేలియా ప్రాజెక్టు నుంచి మూడింట రెండు వం తులు భారత్‌కు దిగుమతి అవుతుందని చెప్పారు. అదానీ గ్రూపు ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ పేరు నేరుగా ప్రస్తావించకుండానే 'ఈ జెంటిల్‌మన్‌ మోడీ ఆస్ట్రే లియా పర్యటన ఆద్యాంతం ప్రధానమంత్రి తోనే వున్నారు' అని పేర్కొన్నారు. ప్రధాని అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లో మోడీ వాణిజ్య ప్రతినిధి బృందంలో అదానీ వున్నారని గుర్తు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: