సార్క్ దేశాల కూటమి సమావేశాల సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడి దౌత్య మర్యాదలను ఉల్లంఘించారని నేపాల్ పత్రికలు ఆరోపించాయి. ఆయన తన పరిమితులు గుర్తెరగకుండా నేపాల్ రాజ్యాంగం ఎలా ఉండాలో సలహా ఇవ్వడం నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అని విరుచుకుపడ్డాయి. పాత పెద్దన్న వైఖరి, జోక్యందారీ పెత్తనం సహించరానివని కాంతిపుర్, నాగరిక్ పత్రికలు విమర్శించాయి. నేపాల్ లో రాచరికాన్ని కూల్చివేసిన తర్వాత రాజ్యాంగ రచన ఇంకా పూర్తి కాలేదు. అనేక జాతుల సంగమం అయిన నేపాల్ లో జాతుల హక్కులను గుర్తించే ఫెడరల్ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని వివిధ మైనారిటీ జాతులు కోరుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ వారి డిమాండ్ ను ఆమోదించడం లేదు. మాధేసీ పార్టీ, యు.సి.పి.ఎన్ (మావోయిస్టు) పార్టీలు ఇతర చిన్నా చితకా పార్టీలు మాత్రమే ఈ డిమాండ్ కు మద్దతు ఇస్తున్నాయి. అయితే రాజ్యాంగాన్ని రచించవలసిన రాజ్యాంగ సభ (కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ) లో మొదటి ఎన్నికల్లో అత్యధిక సీట్లు సంపాదించినప్పటికీ యు.సి.పి.ఎన్ (మావోయిస్టు) పార్టీ మెజారిటీ సాధించలేకపోయింది. దానితో ఫెడరల్ తరహా రాజ్యాంగ రచన సాధ్యం కాలేదు. చివరికి రాజ్యాంగ రచన పూర్తి కాకుండానే మొదటి రాజ్యాంగ సభ పదవీకాలం పూర్తైపోయింది. ఫలితంగా రెండవ రాజ్యాంగ సభ ఎన్నిక తప్పలేదు. రెండో రాజ్యాంగ సభలో పాత నేపాలీ కాంగ్రెస్, సి.పి.ఎన్(యు.ఎం.ఎల్) లాంటి పార్టీల కూటమి మెజారిటీ సాధించడంతో జాతుల ఆకాంక్షలకు గుర్తింపు లేని రాజ్యాంగం ఏర్పడే ప్రమాదం నెలకొంది. ఈ నేపధ్యంలో ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగ రచన పూర్తి చేయాలా లేక మెజారిటీ అభిప్రాయం ద్వారా పూర్తి చేయాలా అన్న సందిగ్ధ పరిస్ధితి ఏర్పడింది. మెజారిటీ లేని ప్రతిపక్ష పార్టీలు, వివిధ జాతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్ధలు ఏకాభిప్రాయం ద్వారానే రాజ్యాంగ రచన జరగాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా మెజారిటీ సంపాదించిన పార్టీలు ఏకాభిప్రాయ వాదనను అంగీకరిస్తూనే ఎంతకీ తెగని విషయాల్లో మెజారిటీ అభిప్రాయాన్ని అనుసరించాలని చెబుతున్నాయి. సార్క్ సమావేశాల కోసం నేపాల్ వెళ్ళిన భారత ప్రధాని నరేంద్ర మోడి ఖాట్మండులో బిర్ ఆసుపత్రిలో ట్రామా సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన మోడి రాజ్యాంగ రచన తీవ్రంగా ఆలస్యం కావడం వల్ల నష్టాలు ఉన్నాయని నేపాల్ ను హెచ్చరించారు. ఏకాభిప్రాయం ద్వారానే రాజ్యాంగ రచన పూర్తి చేయాలని బోధించారు. అంతటితో ఆగకుండా అంకెల మెజారిటీ ద్వారా రాజ్యాంగ రచన చేయడం వల్ల ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. మోడి హెచ్చరికలు నేపాల్ లోని ప్రధాన పార్టీలకు వారికి మద్దతు వచ్చే పత్రికలకు సహజంగానే రుచించలేదు. “భారత ప్రధాని దౌత్య లక్షణ రేఖను అతిక్రమించారు. అంకెల బలం ద్వారా రాజ్యాంగ రచన పూర్తి చేయరాదని చెప్పడం ద్వారా మధ్యంతర రాజ్యాంగంలో ఉన్న వివిధ నిబంధనలను ఆయన దానిని పరిగణనలోకి తీసుకోలేదు” అని కాంతిపుర్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. ఏకాభిప్రాయం ద్వారా రాజ్యాంగం రచించాలని పేర్కొంటూనే ఏకాభిప్రాయం సాధించలేని చోట మెజారిటీ ద్వారా పూర్తి చేయాలని మధ్యంతర రాజ్యాంగం పేర్కొంటోంది. ఇదే లైన్ ను పాటిస్తామని పాలక పార్టీలు నేపాలీ కాంగ్రెస్, సి.పి.ఎన్(యు.ఎం.ఎల్) లు చెబుతున్నాయి. దానికి మాధేసి పార్టీ, మావోయిస్టు పార్టీ, ఇతర సంస్ధలు అభ్యంతరం చెబుతున్నాయి. తన వ్యాఖ్యల ద్వారా మోడి నూతన దౌత్యాన్ని అవలంబిస్తున్నారని మరో పత్రిక నాగరిక్ విమర్శించింది. ఆగస్టులో ద్వైపాక్షిక సందర్శనకు వచ్చినపుడు సదాభిప్రాయాలను, గౌరవాన్ని కనబరిచారని కానీ తాజా సందర్శనలో ఆయన “పెద్దన్న పాత్ర” వహించకుండా సంయనం పాటించలేకపోయారని నాగరిక్ తన సంపాదకీయంలో విమర్శించింది. “ఈసారి ఆయన తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లుగా స్పష్టం అవుతోంది. గతంలో వ్యక్తం చేసిన సంయమన వైఖరిని విడనాడి పాత పెద్దన్న వైఖరిని తిరిగి చేపట్టారు” అని పత్రిక విమర్శించింది. మెజారిటీ ద్వారా రాజ్యాంగాన్ని ఆమోదించడం ప్రమాదకరం అని చెప్పడానికి ఆయన ఎవరు అని పత్రికలు ప్రశ్నించాయి. నేపాలీ రాజకీయ పార్టీలు భారత్ పై ఆధారపడే వైఖరిని పాటిస్తున్నారని తమ పార్టీలను సైతం పత్రికలు విమర్శించాయి. అంగీకృత అంశాలపై మొదట రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఆ తర్వాత సవరణల ద్వారా మిగిలిన అంశాలు పూర్తి చేసుకోవచ్చని కూడా మోడి తన ప్రసంగంలో సూచించారు. ఈ వైఖరిని అనుసరించేందుకు మాధేసి పార్టీలు, మావోయిస్టు పార్టీ విముఖంగా ఉన్నాయి. ఏకాభిప్రాయంతో రాజ్యాంగ రచన చేయాలన్న సూచనను మాత్రం అవి ఆహ్వానించాయి. ఈ ఉదంతంలో ఓ విచిత్ర పరిస్ధితి నెలకొని ఉంది. పాలక పార్టీలయిన నేపాలీ కాంగ్రెస్, సి.పి.ఎన్(యు.ఎం.ఎల్) పార్టీలు తీసుకున్న వైఖరి ప్రజా వ్యతిరేకం. వారి వైఖరి నేపాలీ సమాజంలో ఇప్పటికే ఆధిపత్యంలో ఉన్న ధనిక, దోపిడి వర్గాలకు మేలు చేస్తుంది. అణచివేతకు గురవుతున్న జాతుల ప్రజలకు కీడు చేస్తుంది. కానీ తమ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోరాదన్న పత్రికల సరైన వైఖరిని వారు చేపట్టారు. మరో పక్క మాధేసి పార్టీలు, మావోయిస్టు పార్టీలు రాజ్యాంగ రచనలో తీసుకున్న ‘ఏకాభిప్రాయ’ వైఖరి సరైనది. దానివల్ల అణచివేయబడిన జాతుల హక్కులకు రక్షణ ఉంటుంది. కానీ ఆ పార్టీలు భారత్ జోక్యందారీ విధానాన్ని ఆహ్వానించడం ఒక స్వతంత్ర దేశం అవలంబించవలసిన వైఖరి కాదు. అయితే మావోయిస్టు పార్టీలోని ఒక పక్షం నేతలు సరైన వైఖరితో ఉన్నట్లు కనిపిస్తోంది. ఏకాభిప్రాయంతో రాజ్యాంగ రచన చేయాలనడం సరైందే అయినా ఆ సలహా ఇవ్వాల్సిన అవసరం భారత్ కు లేదని వారు ప్రకటించారు. భారత్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా, ఐరోపా దేశాల జోక్యం తగదని డిమాండ్ చేసేవారు నేపాల్ లోనూ భారత్ జోక్యాన్ని వ్యతిరేకించాలి. జోక్యందారీ విధానం నేపాల్ కి సరైనదీ, ఇండియాకు విరుద్ధమైనది కాజాలదు. విదేశీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోక పోవడం ప్రతి ఒక్క దేశం పాటించవలసిన అంతర్జాతీయ సూత్రం. ఏ పేరుతో జరిగినా దీనికి భిన్నంగా జరిగేది ఏదైనా సరైన విదేశాంగ విధానం కాజాలదు. కనుక నేపాల్ రాజ్యాంగ రచనను -అది ఏ పద్ధతిలో జరిగినా, దాని ఫలితం ఏదైనా- అక్కడి ప్రజలకు వారికి ప్రాతినిధ్యం వహించే రాజకీయ పార్టీలకు వదిలి పెట్టడం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: